అన్నకేమీ త‌గ్గ‌ట్లేద‌బ్బా!..పెను వివాదంలో వరుణ్ గాంధీ!

Update: 2019-05-05 12:58 GMT
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి.. ఏకంగా సుప్రీంకోర్టుకే సారీ చెప్పారు. ఇక ఆయ‌న పిన్న‌మ్మ మేన‌కా గాంధీ కూడా త‌క్కువేమీ తిన‌లేదు. రాహుల్ వైరి వ‌ర్గం బీజేపీలో సీనియ‌ర్ నేతగానే కాకుండా మోదీ కేబినెట్ లో కీల‌క మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మేన‌కా గాంధీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి ఈసీ ఆగ్ర‌హానికి గుర‌య్యారు. తాజాగా ఈ జాబితాలోకి ఇంకో గాంధీ చేరిపోయారు. మేన‌కా గాంధీ సుపుత్రుడు, రాహుల్ సోద‌రుడు వ‌రుణ్ గాంధీ వంతు ఇప్పుడు వ‌చ్చింది. సుల్తాప్ పూర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయ‌న ఇప్పుడు ఫిలిబిత్ నియోజక‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌ఫునే పోటీ చేస్తున్నారు. ఫిలిబిత్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న త‌న త‌ల్లి మేన‌కాను ఆయ‌న ఈ ద‌ఫా తన నియోజ‌క‌వ‌ర్గ‌మైన సుల్తాన్ పూర్ లో నిల‌బెట్టారు.

ఈ క్ర‌మంలో త‌ల్లి త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు సుల్తాన్ పూర్ వ‌చ్చిన వ‌రుణ్‌.. స్థానికంగా త‌మ ప్ర‌త్య‌ర్థులుగా బ‌రిలోకి దిగిన బీఎస్పీ అభ్య‌ర్థి చంద్ర భద్ర సింగ్‌ ని టార్గెట్ చేస్తూ వివాదాస్ప‌ద వ్యాఖ్యలు చేశారు. ప్ర‌త్య‌ర్థిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతోనే స‌రిపెట్ట‌ని వ‌రుణ్‌... గాంధీ ఫ్యామిలీ నుంచి వ‌చ్చానంటూ త‌ల‌పొగ‌రు చూపించేశారు. ఇప్పుడు వ‌రుణ్ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారిపోయాయి. అయినా వ‌రుణ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఏమ‌న్నారంటే... *మనం దేవుడికి తప్ప ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకోసం నేనున్నా. నేను సంజయ్‌ గాంధీ తనయున్ని. మన పట్ల అగౌరంగా మాట్లాడేవారిని పట్టించుకోవద్దు. అలాంటి వారితో నా షూ లేసు విప్పించుకుంటా. నా ముందు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ప్రజలు మోనూ, సోనూలను చూసి భయపడొద్దు* అంటూ వ‌రుణ్ దాదాపుగా స్వైర విహార‌మే చేశారు.

మ‌రి కేంద్ర మంత్రి గా ఉన్న మేన‌కా గాంధీ పైనే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల పేరిట‌ క‌త్తి దూసిన ఈసీ... వ‌రుణ్ వ్యాఖ్య‌ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి. అయినా అయినా ప్ర‌త్య‌ర్థిపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం వ‌ర‌కు ఓకే గానీ... మ‌రీ షూ లేసులు విప్పించుకుంటానంటూ ఓ విల‌న్ లా వ్యాఖ్య‌లు చేయ‌డ‌మేమిటో అర్దం కాని ప‌రిస్థితి. అంతేకాకుండా గాంధీ ఫ్యామిలీ పేరు చెప్పుకుని కూడా ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక వ‌రుణ్ ప్ర‌స్తావించిన సోనూ - మోనూలు ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే.. స్థానిక ఎమ్మెల్యే అయిన చంద్ర భద్ర సింగ్ ఇప్పుడు మేన‌కాపై బ‌రిలోకి దిగారు. ఆయ‌న‌నే స్థానికులు సోనూ సింగ్ అని పిలుస్తారు. ఆయన సోదరుడు మోనూ సింగ్‌ కి స్థానికంగా ఓ మోస్తరు పేరుందట‌. వారిద్ద‌రి పేర్ల‌ను నేరుగానే ప్ర‌స్తావిస్తూ వ‌రుణ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నిజంగానే సంచ‌ల‌నంగా మారిపోయాయి.
Tags:    

Similar News