ఏపీ స‌ర్కారు కొత్త స్కీమ్‌...కేసు మాఫీ

Update: 2017-05-12 15:47 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అదికార దుర్వినియోగం చేస్తూ ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్నార‌ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ప్పుప‌ట్టింది. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ఉంటే ఇష్టం వచ్చినట్లుగా కేసులు బనాయిస్తాం, టీడీపీ కండువా క‌ప్పుకొంటే నేరాలు చేసినా కేసులు ఎత్తేవేస్తాం అనే నియంత ధోరణితో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ ఆర్‌ సీపీ నుంచి గెలిచిన స్వర్గీయ భూమా నాగిరెడ్డిపై అక్రమంగా ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన్ను రౌడీ అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అయితే కొద్దికాలం త‌ర్వాత భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోగానే కేసులు ఎత్తేసే కార్యక్రమం చేశారన్నారు. రైతులకు రుణమాఫీ లేదు కానీ టీడీపీ నాయకులకు మాత్రం కేసులు మాఫీ చేస్తున్నారని ప‌ద్మ‌ మండిపడ్డారు.

నేరాలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోకుండా వారి కేసులు ఎత్తేసేందుకు ఇప్ప‌టివ‌ర‌కు బాబు 132 జీవోలు విడుదల చేశారంటే...రాష్ట్రంలో ఎంతటి దారుణమైన పాలన సాగుతుందో ప్రజలు గమనించాలని ప‌ద్మ కోరారు. చట్టాలను, న్యాయస్థానాలను చంద్రబాబు అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్ల కేసులో ఎమ్మెల్యేకు కోట్ల రూపాయలు లంచం ఇస్తూ ఆధారాలతో పట్టుబడిన చంద్రబాబు ముఖ్య‌మంత్రిగా ఉంటే...క్రైంకు సంబంధించిన సర్వేలో దేశ వ్యాప్తంగా నలుగురు నేరచరిత్ర కలిగిన మంత్రులు ఉంటే వారిలో ఇద్దరు చంద్రబాబు క్యాబినెట్‌ లో ఉన్నారని ప‌ద్మ మండిప‌డ్డారు. స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సర్వేలో ఈ నిజాలన్నీ బయటపడుతున్నాయన్నారు. ప్రభుత్వం మాది కనుక మా నాయకులు ఏ నేరం చేసినా నిర్థోషులుగా సర్టిఫికేట్లు ఇస్తామనే రీతిలో చంద్రబాబు వైఖరి ఉందని ఆక్షేపించారు. స్పీకర్‌ కోడెల పోలీసులపై దాడి చేసిన కేసు, మంత్రులు అచ్చెన్నాయుడు మహిళపై దాడి చేసిన కేసు, గంటా శ్రీనివాసరావు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసు, దేవినేని ఉమా పోలింగ్‌ను అడ్డుకున్న కేసు ఇవన్నీ కోర్టుకు వెళ్లకుండానే ఎలా మాఫీ చేస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యే తహశీల్దార్‌ వనజాక్షిపై దాడి చేస్తే చంద్రబాబు తన ఛాంబర్‌ కు పిలిపించుకొని సెటిల్‌ మెంట్‌ చేశారని, నేరాన్ని నమోదు చేయకుండానే మాఫీ చేసే ప్రయత్నం చేయడమే పెద్ద నేరం కాదా అని వాసిరెడ్డి ప‌ద్మ ప్ర‌శ్నించారు.

అధికార పార్టీకి ఒక నియ‌మం, ప్ర‌తిప‌క్షానికి మ‌రో నియ‌మం అన్న‌ట్లుగా సాగుతున్న‌ద‌ని ప‌ద్మ వ్యాఖ్యానించారు. ``ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఎయిర్‌పోర్టుకు వెళితే ఎక్కడా లేని విధంగా రన్‌వేపైనే అరెస్టు చేశారు. దివాకర్‌ ట్రావెల్స్‌ ప్రమాద బాధితులకు అండగా డాక్టర్లను పోస్టుమార్టం రిపోర్టుపై ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడతారు. సీనియర్‌ అధికారి బాలసుబ్రమణ్యంను నడిరోడ్డుపై నిలబెట్టి టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు దుర్భాషలాడిన కేసులుండవా`` అని వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు.  భారతదేశవ్యాప్తంగా ఈ స్థాయిలో కేసులు ఎత్తేసిన ప్రభుత్వం ఏదీ లేదని, చంద్రబాబు 122 కేసులు మాఫీ చేయించి రికార్డు సృష్టించాడని ఎద్దేవా చేశారు. దీన్ని ఏ న్యాయస్థానం అయినా ఉపేక్షిస్తుందా అని టీడీపీ సర్కార్‌ను ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నాయకులైతే చాలు నడిరోడ్డుపై ఎవరినైనా హత్య చేసినా కేసుండదనే సూచ‌న‌లు ఇస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. త‌మ‌కు చట్టం వర్తించదని, పోలీసులు త‌మ‌ బానిసలు అనే ధోరణిలో ప్రభుత్వం ఉందని ప‌ద్మ మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News