టీటీడీపై సీబీఐ విచారణ చేసే దమ్ముందా బాబూ..?

Update: 2018-05-19 08:00 GMT

తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై  సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లోని వైఎస్సాసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పలు సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామి నగలపై ప్రధాన అర్చకులు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మైసూర్ మహారాజు ఇచ్చిన విలువైన నగలో పింక్ డైమండ్ కన్పించడం లేదని రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలన్నారు.

భక్తులు వేసిన నాణేలకు నగలోని డైమండ్ పగిలిపోయిందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని.. అదే డైమండ్ జెనీవాలో వేలంకు వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. శ్రీవారి నగలను దోచుకునేందుకే తెరలేపారని రమణ దీక్షితులు ఆరోపించారని.. ఈ విషయంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 65 ఏళ్లకు అర్చకులు రిటైర్ కావాలనే కొత్త సంప్రదాయం తీసుకురావడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అవకాశం ఇస్తే పీఠాధిపతుల స్థానంలో చింతమనేని - దేవినేని ఉమా - బోండా ఉమా - అచ్చెన్నాయుడులను నియమించే ఘనుడని ఎద్దేవా చేశారు.

సీఎం చంద్రబాబు అవినీతిపై సీబీఐతో విచారణ జరిపిస్తే రూ. 4 లక్షల కోట్ల దోపిడీ బయటపుడుతుందని వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రతిపక్ష పార్టీపై ఆరోపణలు చేస్తూ తప్పించుకోవడం కాదని.. దమ్ముంటే సీబీఐ విచారణను ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసుతో పాటు చంద్రబాబుపై ఉన్న ఇతరకేసుల్లో ఏ ఒక్కటి విచారణకు వచ్చినా ఆయన జీవితాంతం జైల్లో ఉండడం ఖాయమని వాసిరెడ్డి అన్నారు..

Tags:    

Similar News