బైకులు - కార్లు ఉన్నోళ్ల‌పై ప‌న్నులు వేస్తాం

Update: 2017-09-16 09:58 GMT
ఎన్నిక‌లే ఎజెండాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ముచ్చ‌ట‌గా మూడో సారి చేసిన మంత్రివర్గ విస్తరణలో టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి అల్ఫోన్స్ కన్ననథానం తాజాగా మ‌రోమారు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. భారత్ పర్యటనకు వచ్చే విదేశీ టూరిస్టులకు బీఫ్ విషయంలో ఆయ‌న చేసిన సూచన క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ప‌న్నుల విష‌యంలో మ‌రోమారు అదే సూచ‌న చేశారు. ప‌న్ను క‌ట్టే స్థోమత ఉన్న‌వాళ్ల మీదనే ప‌న్ను వ‌సూల్ చేస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు.

తిరువ‌నంత‌పురంలో ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌పై ప‌న్ను వేస్తామ‌ని తెలియ‌జేయ‌డాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మంత్రి చెప్పారు. `పెట్రోల్ ఎవ‌రు కొంటారు. కార్లు - బైక్‌ లు  ఉన్న‌వాళ్లే క‌దా. వాళ్లేమీ ఆక‌లితో అల‌మ‌టించ‌డంలేదు. వాళ్లు ప‌న్ను క‌ట్టేందుకు సిద్దంగా ఉన్న‌వాళ్లే. వాళ్లు క‌చ్చితంగా ప‌న్ను క‌ట్టాల్సిందే`` అని కేంద్ర టూరిజం శాఖ‌ మంత్రి కేజీ ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గ‌డాన్ని స‌మ‌ర్థించిన ఆయ‌న ఆ డ‌బ్బును పేదల సంక్షేమానికి వినియోగిస్తామ‌ని చెప్పారు. పేద‌ల‌కు సాయం చేయాల‌న్న ఉద్దేశంతోనే ట్యాక్స్‌ లు వ‌సూల్ చేస్తున్నామ‌ని, ఇళ్లు - టాయిలెట్లు - మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ఆ సొమ్ము వాడుతున్న‌ట్లు మంత్రి చెప్పారు. తానేమీ త‌ప్పు మాట్లాడ‌డం లేద‌ని, కార్లు-బైక్‌ లు కొన్న‌వాళ్లు ఉన్న‌త శ్రేణి వ్య‌క్తులు అని, వాళ్లు ట్యాక్స్ క‌ట్టాల్సిందే అని, లేదంటే పేద‌ల బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

గ‌తంలో బీఫ్‌ పై ఆయ‌న ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. భార‌త‌దేశంలో ఎన్నో అంద‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయని ఇక్క‌డికి వ‌చ్చి చూడాల‌ని టూరిస్టుల‌ను కోరారు. అయితే విదేశాల్లో బీఫ్ తిని ఇక్క‌డ ప‌ర్య‌టించాల‌ని కోరారు.
Tags:    

Similar News