పొల్యూష‌న్ త‌గ్గించేందుకు చార్జీలు పెంచేశారే!

Update: 2017-11-09 07:37 GMT
బోడిగుండుకు.. మోకాలికి ఏమాత్రం సంబంధం లేకున్నా.. లింకు పెట్టేటోళ్లు కొంద‌రు క‌నిపిస్తుంటారు. అలాంటి వాళ్ల‌ను చూసి జాలిప‌డాల్సిందే. కానీ..ప‌వ‌ర్ చేతిలో ఉన్నోళ్లు అలా వ్య‌వ‌హ‌రిస్తే ఇబ్బందులే ఇబ్బందులు. ఇప్పుడు ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు అలాంటి ఇబ్బందే ఎదురుకానుంది.

పాల‌కులు చేసిన త‌ప్పుల‌కు మూల్యం చెల్లిస్తున్న దేశ రాజ‌ధాని ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు అక్క‌డి అధికారులు తీసుకున్న నిర్ణ‌యం ఠారెత్తేలా చేస్తోంది. విప‌రీత‌మైన వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న న్యూఢిల్లీ న‌గ‌రంలో వాతావ‌ర‌ణ అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించ‌టం తెలిసిందే. ఢిల్లీలో వాయు నాణ్య‌త సూచీ 500ల‌కు 484 చూపిస్తున్న నేప‌థ్యంలో సుప్రీంకోర్టు నియ‌మించిన పొల్యూష‌న్ ప్రివెన్ష‌న్ అండ్ కంట్రోల్ అథారిటీ విచిత్ర‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుంది.

వాయు కాలుష్యాన్ని త‌గ్గించాలంటే రోడ్డు మీద‌కు వ‌చ్చే వాహ‌నాల్ని త‌గ్గించాల‌న్న భావించిన అథారిటీ.. వాహ‌నాల పార్కింగ్ ఛార్జీల‌ను పెంచేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. వాహ‌నాల పార్కింగ్ ఛార్జీల‌ను పెంచ‌టం ద్వారా వాహ‌నాల్ని రోడ్ల మీద‌కు తీసుకురావ‌టం ఆపేస్తార‌న్న‌ది అధికారుల ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

ఒక‌వేళ అదే నిజ‌మ‌ని అనుకుందాం.. లీట‌రు పెట్రోల్ 75 కాస్తా 80 రూపాయిలు చేశార‌నుకుందాం.. వాహ‌నాలు న‌డ‌ప‌టం ఆపేస్తారా?  అయితే.. ప్ర‌భుత్వాన్ని.. లేదంటే త‌మ ద‌రిద్రాన్ని తిట్టుకుంటూ.. ఆ లోటును పూడ్చేందుకు మ‌రో మార్గాన్ని ఎతుక్కుంటారే కానీ వాహ‌నాల్ని న‌డ‌ప‌టం మానేయ‌రు.

అదే తీరులో వాహ‌నాల పార్కింగ్ ఫీజుల్ని పెంచేయ‌టం ద్వారా వాహ‌నాల్ని ఇళ్ల‌ల్లో నుంచి రోడ్ల మీద‌కు తీసుకురార‌న్న‌ది కూడా స‌రైన అంచ‌నా కాదు. ఎందుకంటే.. ఢిల్లీ వాహ‌నాల‌కు పెంచిన ఛార్జీల లెక్కనే చూద్దాం.  ఢిల్లీలోని 104 పార్కింగ్ లాట్ల‌లో పార్కింగ్ ఫీజుల్ని పెంచారు. కారు పార్కింగ్ కోసం క‌నీసం రూ.80.. టూవీల‌ర్ అయితే రూ.40గా డిసైడ్ చేశారు.  అంటే.. సాధార‌ణంగా పెంచింది ఓ రూ.20 నుంచి రూ.30 మాత్ర‌మే. అంటే నెల‌కు త‌మ సొంత  వాహ‌నం బ‌య‌ట‌కు తీయ‌టం ద్వారా పార్కింగ్ ఫీజుల పెంపు బారం అయితే రూ.600 నుంచి రూ.1500 మ‌ధ్య‌లో ప‌డుతుంది.

ఒక టూవీల‌ర్‌.. కారు ఉన్న వారి మీద ఈ భారం అంత పెద్ద‌దేం కాదు. స‌ర్లే కానీ.. ఎన్ని భారాలు మోయ‌టం లేదంటూ తిట్టుకుంటూ క‌డ‌తారే త‌ప్పించి.. ఈ స్వ‌ల్ప భారానికి భ‌య‌ప‌డిపోయి.. సొంత వాహ‌నం వ‌దిలేసి ప‌బ్లిక్ వాహ‌నాల్ని మాత్ర‌మే వాడ‌తార‌నుకుంటే త‌ప్పే అవుతుంది. వాయుకాలుష్యానికి చెక్ చెప్పేందుకు నిర్మాణాత్మ‌క చ‌ర్య‌లు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న తీసుకోవాలే త‌ప్పించి  ఛార్జీల పెంపు లాంటి అర‌కొర చ‌ర్య‌ల‌తో ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న విష‌యాన్ని గుర్తించాలి. తుగ్ల‌క్ నిర్ణ‌యాలతో వాయుకాలుష్యం లాంటి భూతానికి చెక్ చెప్ప‌టం సాధ్య‌మేనా?


Tags:    

Similar News