వెంకయ్య పోటీ ఏపీ నుంచి మాత్రం ఉండదు

Update: 2016-04-11 07:08 GMT
కేంద్రంలో మోడీ సర్కారులో కీలక పాత్ర పోషించే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏం చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఆయన రాజ్యసభ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ మధ్యనే పదవీకాలం పూర్తి కానున్న రాజ్యసభ సభ్యులకు ఫేర్ వెల్ పార్టీ కూడా ఇచ్చేయటం.. అందులో వెంకయ్య ఉండటం తెలిసిందే. గడిచిన మూడు దఫాలుగా కర్ణాటక నుంచి పోటీ చేసి.. రాజ్యసభలోకి అడుగుపెడుతున్న వెంకయ్య ఈసారి ఎక్కడ నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది.

బీజేపీలో రాజ్యసభ సభ్యత్వం మూడుసార్లకు మించి ఎవరికి ఇవ్వరు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం అలవాటు లేని (గతంలో పోటీ చేసి ఓడిపోయారు) ఆయన.. రాజ్యసభ ద్వారా ఎంపిక కావటం మొదలు పెట్టారు. ఈసారి తనకెంతో సన్నిహితుడైన చంద్రబాబు ఏపీలో పవర్ లో ఉండటం.. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న నేపథ్యంలో.. ఆయన సాయంతో రాజ్యసభకు వెళతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దీని మీద వెంకయ్య రియాక్ట్ అయ్యారు. తాను ఏపీ నుంచి పోటీ చేయటం లేదని చెప్పారు. తమ పార్టీకి తగినన్ని ఓట్లు లేవని..బరిలోకి దిగితే తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అయితే.. అది తనకు ఇష్టం లేదని తేల్చారు. ఎక్కడ నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని తేల్చని వెంకయ్య.. ఏపీ నుంచి మాత్రం బరిలో దిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. వెంకయ్యను మరోసారి కర్ణాటక నుంచే రాజ్యసభకు ఎంపిక చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News