వాతలు పెట్టుకున్న వెనిజులా..వెనక్కి తగ్గింది!

Update: 2016-12-19 08:16 GMT
నోట్ల రద్దు వ్యవహారం చిన్న విషయం కాదు. దేశం పెద్దదా చిన్నదా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఒక్కసారిగా చెలామణిలో ఉన్న నోట్లను రద్దు చేయడం అనేది మామూలు సమస్య కాదు. అయితే భారత్ వంటి దేశాలు ఈ విషయంలో కాస్త సాహసం చేసి పెద్ద నోట్లను రద్దుచేయగానే తమదేశంలో కూడా పెద్ద నోటును రద్దుచేస్తామని ప్రకటించింది వెనిజులా ప్రభుత్వం. అయితే ప్రకటన అయితే చేయగలిగింది కానీ... ప్రజా వ్యతిరేకతను మాత్రం ఆపలేకపోయింది!

తమ దేశంలో కూడా పెద్దనోటు రద్దుచేస్తామని ప్రకటించిన వెనిజులా వెనక్కితగ్గింది. ఇప్పటికే కావాల్సినంత కరెన్సీ సంక్షోభంలో ఉన్న జనం.. నోట్ల రద్దు అనేసరికి రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. దీంతో ప్రజా వ్యతిరేకత పెరగడం చూసిన సర్కారు తోక ముడిచింది. అయితే ఈ విషయాన్ని పూర్తిగా రద్దు చేయడకుండా ప్రస్తుతానికి వాయిదా మాత్రం వేసింది. అనంతరం జనవరి రెండు నుంచి నోట్ల రద్దు నిర్ణయం అమల్లోకి వస్తుందని, ఆలోపు జనం జాగ్రత్తపడాలని సూచించింది. అయితే అక్కడ ప్రజలు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో అదికాస్త రివర్స్ అయ్యింది.

కాగా వెనిజుల ప్రభుత్వం డిసెంబరు 11న తమ దేశంలోని పెద్దనోటైన 100బొలివర్స్ ను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా ఆ 100బొలివర్స్ నోటును మార్చుకోవడానికి కేవలం 10రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. దీంతో తొలి రెండు రోజుల్లోనూ కొన్ని వందల కి.మీ. ప్రయాణించి మరీ బ్యాంకుల ముందు క్యూ కట్టిన ప్రజలకు అక్కడికి ప్రభుత్వం ప్రకటించిన కొత్త నోట్లు రాకపోయేసరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోవైపు 100 స్థానంలో 20వేల బొలివర్స్‌ నోటును అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆ నోటు కూడా ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఉన్న అతిపెద్ద నోటును రద్దు చేయడం, తెస్తామన్న 20వేల బొలివర్స్‌ కొత్త కరెన్సీ అందుబాటులోకి రాకపోవడంతో జనం కష్టాలు తారస్థాయికి చేరాయి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అనే సామెత వెనిజులాకు తెలియదేమో పాపం!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News