వెంకయ్య మాట: నేను బతికుండగా వాళ్లు రారు

Update: 2017-08-09 07:05 GMT
సినీ కుటంబాలకు చెందిన వారసులు అదే రంగంలోకి వచ్చినట్లే.. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు కూడా అదే ఫీల్డ్ లోకి రావడం సహజం. ఐతే తన కుటుంబ సభ్యులు మాత్రం రాజకీయాల్లోకి రావడం తనకు కానీ.. వాళ్లకు కానీ ఇష్టం లేదని కేంద్ర మాజీ మంత్రి.. ఇటీవలే ఉపరాష్ట్రపతిగా ఎంపికైన వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. తాను జీవించి ఉండగా.. తన కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లోకి రారని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తన కుటుంబ సభ్యులకు కూడా ఎంతమాత్రం చింత లేదని ఆయన అన్నారు.

‘‘నా భార్య ఉష గురించి జనాలకు పెద్దగా తెలియదు. ఆమె లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. నా కొడుకు ఆటోమొబైల్ డీలర్ గా ఉంటూ వ్యాపారంలో తలమునకలై ఉన్నాడు. నా కూతురు స్వర్ణ భారతి ట్రస్టు ద్వారా సామాజిక సేవలో ఉంది. ఆమె మాత్రం అప్పుడప్పుడూ బయట కనిపిస్తుంది. వీళ్లెవ్వరూ కూడా నా రంగంలోకి రావాలని అనుకోవడం లేదు. నేను కూడా వాళ్ల వ్యవహారాల గురించి పట్టించుకోను’’ అని వెంకయ్య అన్నారు.

తాను రాజకీయాల్లో.. ప్రభుత్వంలో పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ ఏనాడూ కూడా తన పిల్లలు ఎప్పుడూ రాజకీయంగా కానీ.. మరో రకంగా కానీ లాబీయింగ్ చేయడానికి ప్రయత్నించలేదని వెంకయ్య కితాబిచ్చారు. తాను మిగతా నాయకుల్లా వారసత్వ రాజకీయాల్ని ప్రోత్సహించనని వెంకయ్య స్పష్టం చేశారు. తనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వకున్నప్పటికీ తాను 2019 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి వీడ్కోలు  తీసుకోవాలని అనుకున్నట్లు వెంకయ్య తెలిపారు. నరేంద్ర మోడీని రెండోసారి ప్రధానిగా చూశాక తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని తన భార్యకు కూడా ముందే చెప్పినట్లు తెలిపారు. ఐతే ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టడం ద్వారా తాను రెండేళ్ల ముందే రాజకీయాల నుంచి రిటైరవ్వాల్సి వచ్చిందన్నారు వెంకయ్య.

Tags:    

Similar News