మ‌న‌సులో మాట చెప్పిన వెంక‌య్య‌

Update: 2015-12-02 06:51 GMT
ఏపీకి ప్రత్యేక‌ హోదా గురించి పార్లమెంటులో కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాలా శాఖా మంత్రి ఎం.వెంక‌య్య‌నాయుడు చేసిన వ్యాఖ్య‌ల్లో మ‌ర్మం ఏంటి? ఎందుకు వెంక‌య్య‌నాయుడు స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న కంటే సాకులు వెతుక్కోవ‌డానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప‌రిణామాల‌న్నీ వివ‌రించ‌డం ద్వారా ప్ర‌త్యేక హోదాపై కేంద్రం వైఖ‌రిని చెప్పేయ‌ద‌ల్చుకున్నారా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా వెంక‌య్య‌నాయుడు ప్ర‌సంగిస్తూ ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌త్యేక హోదా ఇవ్వాలని  అడిగిన తర్వాత పశ్చిమ బెంగాల్ - ఒడిషా - బీహార్ కూడా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. అభివృద్ధి చెందిన పంజాబ్ వంటి రాష్ట్రం కూడా హోదా కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని వెంకయ్య వాపోయారు. నిజానికి ఏపీలో కొండ ప్రాంతం గానీ, ప్రత్యేక పరిస్థితులున్న దేశాల సరిహద్దు రాష్ట్రం గానీ కాదని, అటవీ భూభాగం కూడా లేదని వెంకయ్య వెల్లడించారు.

వెంకయ్య ఇప్పుడు ఇచ్చిన వివరణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘకాలం నుంచీ పార్లమెంటేరియన్‌ గా కొనసాగుతున్న వెంకయ్య.. ప్రత్యేక హోదా డిమాండ్ చేసే సమయంలో ఆయనకు ఇలాంటి నిబంధనలు అడ్డువస్తాయన్న విషయం ఎందుకు గుర్తురాలేదని ప‌లువురు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఏపీకి హోదా రావాలని తనకు వ్యక్తిగతంగా కోరిక ఉన్నప్పటికీ, దేశంలో మెజారిటీ నిర్ణయమే అంతిమమని చెప్పడం బట్టి... హోదా రానట్టే నని చెప్పకనే చెప్పడమేనని అంటున్నారు. హోదాకు కాంగ్రెస్ సహకరిస్తున్న‌ప్ప‌టికీ కేంద్రం ఎందుకు వెనుకంజ వేస్తుందో అర్ధం కావటం లేదన్న విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీనే ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందువల్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు గానీ, కాంగ్రెస్ గానీ హోదాను అడ్డుకునే పరిస్థితులు ఉండవని, ఒకవేళ అడ్డుకుంటే కాంగ్రెస్ మరోసారి ప్రజల ముందు దోషిగా నిలుస్తుందని విశ్లేషిస్తున్నారు.

తాజా పరిణామాలు అటు అధికార తెలుగుదేశం పార్టీని  సంకట స్థితిలో నెట్టగా, ఎదగాలని చూస్తున్న కమలానికి కలవరం కలిగిస్తున్నాయి. హోదా సాధిస్తామని ఇప్పటివరకూ బల్లగుద్ది చెప్పిన టీడీపీ, ఇప్పుడు ప్రజలకు ఏమి జవాబు చెప్పాలో తెలియని గందరగోళంలో ప‌డింద‌ని పేర్కొంటున్నారు. మొత్తంగా బీజేపీ ల‌క్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ లో ఉద్యమాలకు ఊపిరిపోసేలా మారాయ‌ని వివ‌రిస్తున్నారు.
Tags:    

Similar News