ఆహా మోడీ వేరు.. ఆయ‌న మాట కూడా !

Update: 2022-08-09 04:55 GMT
పంచెక‌ట్టు పెద్దాయ‌న ప‌ద‌వీ కాలం అయిపోయింది. వీడ్కోలు స‌భ కూడా నిన్న‌నే హ‌స్తిన‌పురంలో అయిపోయింది. భావిత‌రాల‌కు స్ఫూర్తి వెంక‌య్య అని మోడీ చెప్ప‌డమే కాదు... . వెంకయ్య భార‌త దేశ రాజ‌కీయాల‌లో చెప్పుకోద‌గ్గ నేత.  ఇవ‌న్నీ బాగున్నాయి. వీటితో పాటే ఇదే సంద‌ర్భాన తెలుగు నేల‌కు మోడీ ఏమ‌యినా సాయం ప్ర‌క‌టిస్తే ఎంత బాగుండో !  
 
వెంకయ్య వెళ్తూ వెళ్తూ కేంద్రానికి ముఖ్యంగా గౌర‌వ పార్ల‌మెంటేరియ‌న్ల‌కు నాలుగు  మంచి మాట‌లు చెప్పి వెళ్లారు. నిజానికి వెంకయ్య అనుభవం ఉన్న మంచి పొలిటికల్ లెక్చరర్. ఆయన మాటలు వింటే దేశానికి మేలే.

కొత్త ఉప రాష్ట్ర‌ప‌తి జ‌న‌దీప్ ధ‌న్క‌ర్ కూడా వెంక‌య్య నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ! ఆ మాట‌కు వ‌స్తే తెలుగు నాయ‌కులు చాలామంది కొన్ని విష‌యాల్లో (అన్నీ కాదు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి క‌నుక ) ఆయ‌న‌ను ఫాలో కావొచ్చు. త‌ప్పేం లేదు. జాతీయ పార్టీల‌లో ప్రాంతీయ నాయ‌కుల ఎదుగుద‌ల అంత‌గా ఉండ‌దు అని అనుకునే వారికి వెంక‌య్య ఉదాహర‌ణ అయి ఉంటారు.

ఆమాట కు వ‌స్తే శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ఎర్ర‌న్నాయుడికి కూడా దారి చూపింది వెంక‌య్యే ! ఆయ‌న కుమారుడు యువ ఎంపీ రామూకి కూడా ఇవాళ్టికీ మెంటార్ గానే ఉన్నారు. వెంక‌య్య  త‌న వాక్చాతుర్యంతో కొన్ని త‌రాల‌ను ప్ర‌భావితం చేశారు. ఇక వెంకయ్య భాష గురించి కచ్చితంగా చెప్పాలి. బాగుంటుంది. వెంకయ్య ప్ర‌సంగాలు ఓ సారి విన‌వ‌చ్చు. పుస్త‌క రూపంలో వ‌స్తే ఓ సారి చ‌దివి వ‌దిలేయ‌వచ్చు. క‌రుడు గ‌ట్టిన కాషాయ వాది అయితే కాదు...  వీలున్నంత వ‌ర‌కూ కాంగ్రేస్సేత‌ర రాజ‌కీయం న‌డిపారు. దీని వల్ల ఆయ‌న‌కు కొంత మంది ద‌క్షిణాది నేత‌లు చేరువ అయ్యారు.

ఆ క్ర‌మంలో చంద్ర‌బాబు మొదలుకుని కొంద‌రు నేత‌ల‌ను ఆయ‌న బాగానే ప్రోత్స‌హించారు. ఆ విధంగా రాష్ట్రం విభ‌జ‌న లోనూ కొంత పాత్ర పోషించారు. అది స‌మ‌ర్థ‌నీయ‌మా కాదా అన్న‌ది అటుంచితే  ఆయ‌న కొన్ని ప‌నులు రాజ‌కీయ నాయ‌కుడు క‌నుక రాజ‌కీయాల్లో భాగంగానే చేశారు.

 బీజేపీ త‌ర‌ఫున  చాలా వ‌ర‌కూ విజ‌య‌వంతం  అయ్యాకే ఆయ‌న‌కు ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి వ‌చ్చింద‌న్నది ఓ నిర్వివాదం. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ మోడీ చెప్పిన‌విధంగా ఓ కార్య‌క‌ర్త స్థాయి నుంచి ఎదిగిన వెంక‌య్య ను ఆఖ‌రిదాకా ఆర్ఎస్ఎస్ ఎందుక‌నో గైడ్ చేయ‌లేదు. మ‌ధ్య‌లోనే వ‌దిలేసింది. అదేవిధంగా ఆయ‌న‌కు జ‌న‌సేన‌తోనూ, శివ‌సేన‌తోనూ స్నేహాలు ఉన్నాయి. అవి ఇక‌పై కూడా కొన‌సాగి తీరుతాయి కూడా ! ఎనీవే ముందున్న కాలంలో కూడా వెంక‌య్య మ‌రింత ఆరోగ్యంతో ఆనందంతో రాజ‌కీయాల‌కు దూరంగా వివాదాల‌కు దూరంగా ఉండాల‌ని కోరుకోవ‌డం ఓ బాధ్య‌త.
Tags:    

Similar News