ఆ కథనాలపై వెంక‌య్య నాయుడు ఆవేద‌న చెందారా?

Update: 2022-06-24 05:20 GMT
ప్ర‌స్తుత ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఆవేద‌న చెందారా? రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో త‌న‌పై వ‌చ్చిన క‌థ‌నాల విష‌యంలో క‌ల‌త చెందారా అంటే అవున‌నే చెబుతున్నారు.. బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన స‌త్య‌కుమార్. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక సంద‌ర్భంగా ప్ర‌ధాన వార్తా ప‌త్రిక‌లు, టీవీ చానెళ్లు త‌దుపరి రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య నాయుడిని ఎంపిక చేస్తున్నార‌ని క‌థ‌నాలు ఇచ్చాయి. ద‌క్షిణ భార‌త‌దేశానికి బీజేపీ అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వ‌బోతోంద‌ని క‌థ‌నాలు రాశాయి.. ప్ర‌సారం చేశాయి.

ఆ త‌ర్వాత బీజేపీ అధిష్టానం ద్రౌప‌ది ముర్మును రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌డంతో వెంక‌య్య నాయుడికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, అమిత్ షా అన్యాయం చేసిన‌ట్టు క‌థ‌నాలు ప్ర‌సారం చేశాయి. బీజేపీ లైనుకు అనుగుణంగా, న‌రేంద్ర మోడీ అభీష్టానికి అనుగుణంగా వెంక‌య్య నాయుడు న‌డుచుకున్నా ఆయ‌న‌ను రాష్ట్ర‌ప‌తిగా ఎంపిక చేయ‌లేద‌ని క‌థ‌నాలు రాశాయి. వీటి ప‌ట్ల వెంక‌య్య నాయుడు క‌ల‌త చెందార‌ని బీజేపీ నేత స‌త్య‌కుమార్ చెబుతున్నారు.

వెంక‌య్య నాయుడు ఎన్ని సేవ‌లు అంద‌జేసినా న‌రేంద్ర మోడీ, అమిత్ షా.. వెంక‌య్య‌ను ప‌క్క‌న పెట్టార‌నే వార్త‌ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా వైర‌ల్ అయింది. దీనిపైన ఉప‌ రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు స్పందించార‌ని.. స‌త్య‌కుమార్ చెబుతున్నారు.

రాష్టపతి అభ్యర్థిగా వెంకయ్యను ఎంపిక చేయలేదనే విషయంపై రాష్ట్రంలో అసత్య ప్రచారం జరుగుతోందని అంటున్నారు. ఈ విష‌యంపైన వెంక‌య్య నాయుడు త‌న స‌న్నిహితుల వ‌ద్ద ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ని స‌త్య‌కుమార్ అంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి వెంకయ్య నాయుడుపై అకస్మాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చిందని స‌త్య‌కుమార్ ఆక్షేపించారు. వెంక‌య్య నాయుడు గతంలో ఎమ్మెల్యేగా, నాలుగు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా, అట‌ల్ బిహార్ వాజ్ పేయి, నరేంద్ర మోడీ మంత్రివ‌ర్గాల్లో కేంద్ర మంత్రిగా ప‌నిచేశార‌ని స‌త్య‌కుమార్ గుర్తు చేశారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగానూ ఉన్నార‌న్నారు.

ఈ పదవులన్నీ బీజేపీ పార్టీ తనకు ఇచ్చిన అవకాశాలేనని వెంకయ్యనాయుడు పదేపదే చెప్పేవారని గుర్తు చేశారు. ఇప్పుడు త‌న‌ను రాష్ట్ర‌ప‌తిగా ఎంపిక చేయ‌లేద‌ని ప్ర‌ధానిని త‌ప్పుబ‌డుతూ క‌థ‌నాలు రాయ‌డం స‌రికాద‌ని అంటున్నారు. 70 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి వైదొలుగుతానని వెంక‌య్య నాయుడు చాలాసార్లు చెప్పారని స‌త్య కుమార్ గుర్తు చేస్తున్నారు.
Tags:    

Similar News