బాబు చ‌ర్య‌ను త‌ప్పుప‌ట్టిన వెంక‌య్య‌

Update: 2017-06-01 13:39 GMT
బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు నుంచి ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఊహించ‌ని కామెంట్ వినాల్సి వ‌చ్చింది. చంద్ర‌బాబు త‌న బ‌లంగా చెప్పుకొంటూ దూకుడుగా చేసిన పార్టీ ఫిరాయింపుల విష‌యంలో వెంకయ్య ఘాటు హెచ్చ‌రిక చేశారు. జంప్ జిలానీల‌ను ప్రోత్స‌హించ‌డం స‌రైంది కాద‌ని తెలిపారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్న వెంక‌య్య ప్రకాశం, నెల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన‌నున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఒంగోలులో ఆయ‌న ప‌ర్య‌టించారు.

కొద్దికాలం క్రితం ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యేల‌ను పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింప‌చేసిన సంగ‌తి తెలిసిందే. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ‌లోనూ ఇదే ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఒంగోలులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ ఒక పార్టీ నుంచి ఎన్నికల్లో గెలిచి, మరో పార్టీలో చేరడం సరికాదని చెప్పారు. ఈ విధానాన్ని ప్రోత్స‌హించ‌డం స‌రైంది కాద‌ని వెంక‌య్య వ్యాఖ్య‌లు చేశారు. త‌న మిత్ర‌పక్ష సీఎం ప్రోత్స‌హించిన జంపింగ్‌ ల‌పై వెంక‌య్య ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే ఈ సంద‌ర్భంగా బాబుకు ఊర‌ట క‌లిగించే మ‌రో అంశాన్ని వెంక‌య్య తెలిపారు. ఇటీవ‌లి కాలంలో టీడీపీ-బీజేపీ పొత్తుపై సందేహాలు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. దీన్ని ప్ర‌స్తావిస్తూ పొత్తుపై విష ప్రచారం జరుగుతోందని అలాంటివి న‌మ్మ‌వ‌ద్దని, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ...టీడీపీలు కలిసి పని చేస్తాయని వెంక‌య్య తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఏపీ అభివృద్ధి విష‌యంలో తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. ఏపీకి రూ. 2.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించామని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రకాశం జిల్లా రామయపట్నం పోర్టు ఏర్పాటుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తామని వెంకయ్య అన్నారు. శాశ్వతమైన అభివృద్ధి కోసం ప్రయత్నించాలని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News