ఇవేం రోడ్లురా బాబూ.. పెద్దాయన కూడా అనేశారే...!

Update: 2022-10-04 17:30 GMT
రోడ్లు బాగులేవు మొర్రో అంటోంది సామాన్య జనం. రోడ్లను బాగుచేయించలేరా అని విమర్శిస్తోంది విపక్షం. అయినా కానీ పాలకులలో పెద్దగా చలనం అయితే లేదు. ఇపుడు ఢిల్లీ నుంచి తన సొంత ప్రాంతానికి వచ్చిన పెద్దాయన నిన్నటిదాకా రాజ్యాంగ విధులలో బిజీగా ఉంటూ ఈ మధ్యనే రిటైర్ అయిన  దేశ మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఏపీ రోడ్ల మీద తనదైన కామెంట్స్ చేశారు.

రాష్ట్రంలో  రహదారుల పరిస్థితి  అధ్వాన్నంగా ఉంది అని వెంకయ్యనాయుడు ప్రభుత్వానికి చెప్పాల్సింది చెప్పేశారు. ఏపీలో మంచి రోడ్లు వేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నాను అని కూడా ఆయన పేర్కొన్నారు. నిజంగా వెంకయ్యనాయుడు లాంటి వారు అన్న ఈ మాట విమర్శగా చూడకూడదు, అంతకు మించి అభిశంసనగానే చూడాలని అంటున్నారు. ఆయన నిన్నటి దాకా రాజ్యాంగ పదవిలో ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇపుడు కూడా ఆయన రాజకీయాల‌లో ఎక్కడా లేరు.

అందువల్ల ఆయన మాట జనం మాట. నిఖార్సైన మాట. నిండైన మాట. రోడ్ల సంగతి ముందు చూడండి అంటే కచ్చితంగా అది ప్రభుత్వానికి శరాఘాతంగా గుచ్చే కామెంట్ గానే చూడాలి. ఆయన ఢిల్లీలో తనకు కేంద్రం కేటాయించిన భవనంలో ఉంటారు. కానీ తన సొంత జిల్లా మీద ప్రాంతం మీద మక్కువతో అపుడపుడూ వస్తూంటారు. అలాంటి ఆయనకే రోడ్లు చికాకెత్తిస్తున్నాయంటే తప్పు ఎక్కడ ఉందో ప్రభుత్వ పెద్దలకు అర్ధమవుతోందా అన్నదే ఇక్కడ పాయింట్.

ఇదిలా ఉండగా వెంకయ్యనాయుడు ఇతర విషయాల్లో ప్రభుత్వం చేస్తున్న కొన్ని  మంచి పనులను ప్రశంసించారు.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బాగుంది. ప్రజా ప్రతినిధులు అన్న వారు ఎన్నికల వేళ మాత్రమే జనాల వద్దకు వెళ్ళడం కాదు, వీలైనపుడల్లా జనంలోనే ఉండాలి. వారితో నేరుగా సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న పధకాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ వారికి అందుతున్నాయా లేదా అని అట్టడుగు స్థాయికి వెళ్ళి మరీ తెలుసుకోవాల్సిన అవసరం పాలకులకు ఉంది అని ఆయన అన్నారు.

అలాగే తాను పుట్టిన జిల్లాలో కిసాన్‌క్రాఫ్ట్ కేంద్రం ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని కూడా వెంకయ్యనాయుడు చెప్పారు. నెల్లూరు నుంచి వ్యవసాయ యంత్రాలు అంతర్జాతీయ మార్కెట్‌లోకి వస్తున్నందుకు గర్విస్తున్నాను అని పేర్కొన్నారు.  అయితే వ్యవసాయంలో  కొత్త పద్ధతులు వస్తున్నాయని  దేశీయ పశువుల వినియోగం తగ్గి, యంత్రాల వినియోగం పెరిగిందని  వెంకయ్యనాయుడు అన్నారు.

కిసాన్ క్రాఫ్ట్ వంటి కేంద్రాలు రైతులను యంత్రాల వినియోగంలో ప్రోత్సహించాలని, రైతులు అలవాటు పడే వరకు అవగాహన శిబిరాలు తరచుగా నిర్వహించాలని మాజీ  ఉపరాష్ట్రపతి ఏపీ సర్కార్ కి సూచించారు. ఏది ఏమైనా వెంకయ్యనాయుడు విమర్శలు చేయలేదు, విలువైన సూచనలు చేశారు. రోడ్ల విషయంలో పెద్దాయనగా చెప్పాల్సింది చెప్పారు. మరి ఆయన చెప్పిన దాన్ని మంచిగా స్వీకరించి ఇకనైనా రోడ్ల బాగుకోసం ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెడితే బాగుంటుందేమో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News