బాబు డైనమిక్‌ సీఎం అంట

Update: 2015-04-11 13:11 GMT
తొమ్మిదిన్నరేళ్ల ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబుకు అప్పట్లో హైటెక్‌ సీఎం అన్న పేరు ఉండేది. దానికి తగ్గట్లే హైదరాబాద్‌ నగరానికి హైటెక్‌ నగరంగా కీర్తి తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కింది.

పదేళ్ల విరామం తర్వాత మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చంద్రబాబుకు వచ్చినప్పటికీ.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా.. అప్పులతో కూడిన ఏపీ ఖజానాకు ఆయన సీఎం అయ్యారు. దీంతో.. ఆయనేం చేయాలన్నా నిధుల కొరత ఆయన్ను వెంటాడి.. వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కోటలు దాటే మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. కాకపోతే.. ఏపీ రాజధానిని అత్యద్భుతంగా తయారు చేస్తానని మాట ఇస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో చంద్రబాబును పొగిడేవారే లేని పరిస్థితి. దీంతో.. ఆయనే ప్రధాని మోడీని తరచూ పొగుడుతూ.. కేంద్రం కనికరం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏదోలా కేంద్రం సాయం చేస్తే ఆ డబ్బులతో కూసింత అభివృద్ధి చూపించి మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నది బాబు ఆశ. అందుకే.. తనను ఎంతగా వేధిస్తున్నా.. నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా పంతాలు.. పౌరుషాలకు పోకుండా సామరస్య ధోరణితో మోడీ మనసును దోచుకొని పని పూర్తి చేసుకోవాలన్న తపనలో చంద్రబాబు ఉన్నారు.

ఇలాంటి సమయంలో ఆయనకు ప్రశంస లభించటం చిన్న విషయం కాదు. అది కూడా మిత్రపక్షంలోని కీలకవ్యక్తి.. కేంద్రమంత్రి.. ప్రధాని మోడీ సైతం తాను ఎవరి సలహానైతే తూచా తప్పకుండా పాటిస్తున్నానని చెప్పుకున్నారో.. ఆ వెంకయ్యనాయుడు చంద్రబాబును పొగిడేశారు. తాజాగా అనంతపురానికి వచ్చిన ఆయన.. కస్టమ్స్‌ అకాడమీని ప్రారంభించిన సందర్భంగా వెంకయ్య మాట్లాడారు.

విభజన వ్యవహారంలో ఏపీకి జరిగిన నష్ట్రంపై కన్నీరు కార్చేసిన ఆయన.. అదే సమయంలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందన్న మాటను మరోసారి చెప్పేసి.. ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని కాంగ్రెస్‌ విభజన చట్టంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తూ.. సమావేశానికి వచ్చిన వారిని అలరించే ప్రయత్నం చేశారు.

 ఏపీకి తమ సర్కారు ఏమీ ఇవ్వలేదన్న విషయాన్ని కవర్‌ చేసకుంటూ.. ప్రత్యేక హోదా విషయంలో తాము హ్యాండ్‌ ఇస్తున్న విషయంపై ఎలాంటి సందేహాలు వ్యక్తం కాకుండా.. తప్పులు మొత్తం కాంగ్రెస్‌వే అంటూ దానిపై నెట్టేశారు. చివరగా.. ముఖ్యమంత్రి చంద్రబాబును డైనమిక్‌ సీఎంగా పేర్కొంటూ.. బాబుకు పరమానందాన్ని కలిగించారు. ఏపీకి అవసరమైన నిధులు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు కానీ ముఖ్యమంత్రిని మాత్రం పొగిడేసి మనసుకు తృప్తి కలిగించారు. వెంకయ్య మజాకానా?

Tags:    

Similar News