కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాటల పెట్టె అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే... ఆయన తన ప్రాసలు - విసుర్లతో శ్రోతలను ఆకట్టుకుంటారే కానీ సరస శృంగార సెటైర్లు మాత్రం పెద్దగా వేయరు. కానీ, తాజాగా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సినీ నటి సమంత కూడా అప్పుడప్పుడూ చీర కడుతుంది అంటూ సభికులను నవ్వించారు.
గుంటూరు లాం సమీపంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు కాసేపు హుషారుగా మాట్లాడారు. సినీ నటి పేరును - ఆమె చీరకట్టును ప్రస్తావించి సభికులను హుషారెత్తించారు. ఇటీవల ప్రధాని మోడీ బ్రిటన్ లో పర్యటించిన విషయం ప్రస్తావించిన వెంకయ్య... ఆ ముచ్చట్లు మాట్లాడుతూ ఈ సరదా వ్యాఖ్యలు చేశారు. మోడీకి స్వాగతం పలికేందుకు బ్రిటన్ ప్రధాని భార్య సమంత చీర కట్టుకుని వచ్చిందని... భారత సంప్రదాయాన్ని. వాటికి విలువ ఇచ్చే మోడీకి గౌరవ సూచకంగా ఆమె చీరకట్టులో ఎదురొచ్చారని వెంకయ్య అన్నారు. అయితే... అక్కడితో ఆగకుండా.. మనకూ ఓ సమంతా ఉంది. ఆమె కూడా అప్పుడప్పుడూ చీర కడుతుంది అని సినీ నటి సమంత ఉద్దేశించి అన్నారు. దీంతో సభ అంతా ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. మోదీ కోసం సమంత చీర కట్టుకు వచ్చిందని ఆయన అనేసరికి సభలో ఉన్నవారంతా నవ్వులే నవ్వులు. అలాగే... సినీ నటి సమంతను కూడా వెంకయ్య బాగానే ఫాలో అవుతున్నారంటూ అక్కడున్న నాయకులు - కార్యకర్తలు సరదాగా అనుకోవడం వినిపించింది.