వెంకయ్యా.. ఈ పొగడ్తలేందయ్యా

Update: 2016-03-21 04:45 GMT
అభిమానం ఉండటం తప్పేం కాదు. కానీ.. పేరు చెప్పి ఓ రేంజ్ లో పొగిడేయటం ఏ మాత్రం సరికాదు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి పొగడ్తలు చూసినప్పుడు కాస్తంత అవాక్కవ్వాల్సిందే. చేసిన పనికి పొగడటం తప్పేం కాదు. కానీ.. పొగడటానికే అన్నట్లుగా మాటలు కూడా ఏ మాత్రం మంచిది కాదు. బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మాట్లాడిన వెంకయ్య.. ప్రధాని మోడీని విపరీతంగా పొగిడేశారు.

గడిచిన 22 నెలల కాలంలో ప్రధాని మోడీ హయాంలో సాధించిన విజయాల్ని ఏకరువుపెట్టిన ఆయన.. దేశం ముందుకు వెళుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అందరితో కలిసి అందరి వికాసానికి అనే నినాదంతో దేశంలో మార్పు తెచ్చే ప్రయత్నాన్ని మోడీ చేస్తున్నారన్నారు. మోడీ దేశానికి దేవుడిచ్చిన వరంగా ఆయన అభివర్ణించారు. మోడీకి అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఎంతగా పెరిగిందో చెప్పటానికి టైమ్ మ్యాగ్ జైన్ గుర్తింపును ప్రస్తావించిన వెంకయ్య.. లండన్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో మోడీ మైనపు బొమ్మ ఏర్పాటు చేయటాన్ని గొప్పగా చెప్పారు.

మోడీని ఇంతగా పొగిడేయటానికి కారణాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం పూర్తి అయిన నేపథ్యంలో.. ఆయనకు మరోసారి అవకాశం ఇచ్చే అవకాశం లేదు. దీంతో.. ఆయన కీలక పదవిపై ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే మోడీని ప్రసన్నం చేసుకునేందుకు విపరీతంగా పొగిడేస్తున్నట్లుగా చెబుతున్నారు. పొగడ్తలు అవసరమే కానీ.. అవి హద్దులు దాటినట్లుగా ఉండకూదన్న విషయాన్ని వెంకయ్య మర్చిపోకూడదు. లేకుంటే రివర్స్ అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది సుమా. ఓపక్క అధిక ధరలతో పాటు.. కరవు.. నిరుద్యోగం.. పేదరికం.. అవినీతి దేశాన్ని పట్టి పీడిస్తుంటే.. వాటికి పరిష్కారాలు వెతకాల్సిన సమయంలో చాలానే చేసేశామంటూ చెప్పుకుంటూ.. అక్కడెక్కడో లండన్ లో మోడీ మైనపు బొమ్మను ఏర్పాటు చేయటాన్ని గొప్పగా చెప్పుకోవటం  ఏమిటో..?
Tags:    

Similar News