జంపింగ్స్ పై వెంక‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2017-04-03 16:58 GMT
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో.. ప్ర‌త్య‌ర్థి పార్టీని దెబ్బ తీస్తూ ఫిరాయింపుల్ని ప్రోత్స‌హించ‌టం ఒక ప‌ద్ధ‌తి అయితే.. ఈ ఎపిసోడ్ కి ప‌రాకాష్ఠ‌గా తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల్ని చెప్పొచ్చు. తన‌ను ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీని వ‌దిలేసి.. అధికార దాహంతో పార్టీ ఫిరాయించిన వారికి పెద్ద పీట వేస్తూ.. వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతున్న వైనంపై ప‌లువురు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎవ‌రిదాకానో ఎందుకు.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సైతం గ‌తంలో ఇదే త‌ర‌హాలో విరుచుకుప‌డిన‌వారే. త‌న పార్టీకి చెందిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న పార్టీలోకి తీసుకొని.. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టిన‌ప్పుడు బాబు ఆక్రోశం అంతా ఇంతా కాదు.

ఆ రోజు.. ప్ర‌జాస్వామ్యం.. రాజ్యాంగం అంటూ చాలానే క‌బుర్లు చెప్పిన బాబు.. ఈ రోజున జ‌గ‌న్ పార్టీ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వుల్ని కేటాయించ‌టాన్ని ప‌లువురు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. తాజాగా అలా త‌ప్ప ప‌ట్టే వారి జాబితాలో బాబుకు జాన్ జిగిరీ దోస్త్.. కేంద్ర‌మంత్రి వెంక‌య్యనాయుడు కూడా చేర‌టం గ‌మ‌నార్హం. పార్టీ మారిన వ్య‌క్తులు.. ఆ పార్టీతో వ‌చ్చిన ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌న్న కీల‌క వ్యాఖ్య చేశారు. ఈ మేర‌కు చ‌ట్టం తేవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న వెంక‌య్య‌.. ఇందుకోసం అన్ని పార్టీలు క‌లిసి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 2019లో తెలంగాణ‌లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌న్న వెంక‌య్య‌.. మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌కు తాము వ్య‌తిరేక‌మ‌న్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఒక్క సీటును కూడా క‌మ్యూనిస్టులు గెలుచుకోలేక‌పోయార‌న్న వెంక‌య్య‌.. కాంగ్రెస్ పార్టీ సింగిల్ మేన్ ఎంట‌ర్ ప్రైజ‌స్ గా మారింద‌న్నారు. మ‌త ఛాంద‌స‌వాద శ‌క్తుల‌తో చేతులు క‌ల‌మ‌న్న ఆయ‌న‌.. బీసీ క‌మిష‌న్ కు రాజ్యాంగ భ‌ద్ర‌త క‌ల్పిస్తూ మోడీ నిర్ణ‌యం తీసుకుంటార‌న్నారు. త్వ‌ర‌లోనే పార్ల‌మెంటులో బిల్లు పెడ‌తామ‌ని వెల్ల‌డించారు. అమాయ‌కుల‌కు శిక్ష ప‌డ‌కూడ‌ద‌ని.. స‌త్యంబాబు కేసు విష‌యంలో పునః విచార‌ణ చేప‌ట్టాల‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న అన్ని అంశాల పైనా స్పందించిన వెంక‌య్య మాట‌లు చూసిన‌ప్పుడు.. పార్టీ ఫిరాయింపుదారుల‌కు ప‌ద‌వులు ఇచ్చే విష‌యంతో త‌న అసంతృప్తిని ఓపెన్ గా చెప్పేయటం ద్వారా.. బాబు ప‌ని త‌ప్ప‌ని చెప్పార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News