సన్మానం చేసిన బాబుకు వెంకయ్య షాకిచ్చారా?

Update: 2016-06-17 05:11 GMT
పిలిచి మరీ సన్మానం చేస్తే.. సన్మానం చేసిన వ్యక్తిని ఉద్దేశించి విమర్శలు చేయటం ఉంటుందా? అన్న ప్రశ్న మనసులోకి రావొచ్చు. కానీ.. దాదాపు అలాంటి సంఘటనే తాజాగా జరిగింది. తనకెంతో సన్నిహితుడైన చంద్రబాబు మీద సటైర్ వేసినట్లుగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి వ్యాఖ్య ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత తొలిసారి విజయవాడకు వచ్చిన ఆయన్ను ఏపీ రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబుకు పంచ్ తగిలే మాటను అనటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కావాలని కాకున్నా.. మాటల ఫ్లోలో వచ్చిన మాట బాబుకు కాస్త ఇబ్బందికరంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘‘1978లో ఇందిరాగాంధీ అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు.. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ నెల్లూరు జిల్లాలో నేనొక్కడినే బీజేపీ నుంచి గెలుపొందా. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన నేను రాజ్యసభ సీటు కోసం చంద్రబాబును అడుగుతానా?’’ అంటూ వెంకయ్య వ్యాఖ్యానించటం గమనార్హం.

బీజేపీని దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న ఉద్దేశంతో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాను నిర్ణయించుకున్నానని.. ఒకప్పుడు వాజ్ పేయ్.. అద్వానీలకు మైక్ పట్టుకున్న తాను బీజేపీ అధ్యక్షుడ్ని అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వారి మైకు పట్టుకున్న తాను తర్వాతి కాలంలో వారి మధ్యన కూర్చునే స్థాయికి ఎదిగానన్నారు. రాష్ట్రం నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఎవరైనా నేతలు తన వద్దకే వస్తారని.. అలా వచ్చినప్పుడు తన వద్దకే మంత్రుల్ని పిలిపించి పనులు చేయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి రాజ్యసభలో తాను ఎంత గట్టిగా మాట్లాడానో అందరికి తెలుసన్న ఆయన.. చంద్రబాబునుకూడా పొగిడేశారు. తాను.. చంద్రబాబు కష్టపడి పైకి వచ్చామని చెప్పారు. అంతాబాగానే ఉంది కానీ.. మధ్యలో ఆ కాస్త సటైర్ బాబు మీద వేయకుంటే బాగుండేదేమో..? తనకు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చే విషయమైన ఆలోచిస్తున్నారని.. తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటూ వండేసిన వార్తల ప్రభావం వెంకయ్య మాటల వెనుక ఉండి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాజ్ పేయ్.. అద్వానీ లాంటి వాళ్ల మధ్య కూర్చున్న వెంకయ్యకు ఇలాంటి మాటలు వస్తే గుస్సా రాదా ఏంటి..? ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబును ఒక మాట ఎక్కువ.. తక్కువ అన్నా ఆయన నోరు మెదపలేరన్న విషయం వెంకయ్యకు తెలీదా ఏంటి..?
Tags:    

Similar News