ప్యాకేజీ తెచ్చారని వెంకయ్యకు మరో సన్మానం

Update: 2016-09-27 10:47 GMT
మరెవరికీ సాధ్యం కాని పనులన్నీ సీమాంధ్రులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఓపక్క ప్రత్యేక హోదాతో కలిగే లాభాల చిట్టా చూస్తున్నా.. తెలుగుదేశం పార్టీకి చెందిన పారిశ్రామిక నేతలు ఏపీలో పెట్టుబడి పెట్టకుండా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలు పెడుతున్న వాస్తవాలు బయటకు వస్తున్నాస్పందించని వైనం వారికి మాత్రమే సాధ్యమేమో. తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవలన్న అంశం మీద సీమాంధ్రులంతా ఒకే ఒక్క మాట మీద ఉండని వైనం స్పష్టంగా కనిపిస్తుంది. సాధ్యం అవుతుందో లేదో కూడా తెలీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును.. 2004లో కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో పెట్టిందన్నఒక్క మాట పట్టుకొని.. చివరకు రాష్ట్రాన్నే సాధించుకున్నప్పుడు.. పార్లమెంటులో సాక్ష్యాత్తు ప్రధాని హోదా మీద ఇచ్చిన మాటను నిజం చేసుకోవటం అసాధ్యమా?

ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు.. ఇంకొకరు ఒప్పుకోలేదన్న మాటల్నివినేసి.. మోడీ ఇచ్చిన ముష్టి ప్యాకేజీని చూసుకొని మురిసిపోవటం ఎవరికి మాత్రం సాధ్యమన్న ప్రశ్న తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసినప్పుడు వేసుకోకుండా ఉండలేం. హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ఇచ్చిన దానిపై సీమాంధ్రులు సీరియస్ గా ఉన్నారని తెలిసినా.. మిగిలిన వారి మాదిరి కలిసికట్టుగా పోరాడలేరన్న ధీమానో.. చొక్కా పట్టుకొని నిలదీయలేరన్న నమ్మకమో కానీ.. ఏపీ బీజేపీ నేతలు మరోసారి తమ వైఖరిని చాటుకున్నారు.

సొంత రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అధినాయకత్వాన్నినిలదీయటం మానేసి.. ప్యాకేజీ ఇచ్చారంటూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి సన్మానం చేయటం ఏపీ బీజేపీ నేతలకు మాత్రమే కుదురుతుందేమో? కేంద్రంలో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నందుకు.. జరుగుతున్న పరిణామాల్ని చూసీచూడనట్లుగా ఉండటం ఏపీ అధికారపక్షమైన తెలుగుదేశానికే చెల్లు. ప్రత్యేక హోదాతో పోలిస్తే.. ప్యాకేజీ కారణంగా ఏపీకి వచ్చే ప్రత్యేకమైన ప్రయోజనం పెద్దగా లేకున్నా.. అదేదో సాధించినట్లుగా మొన్న బెజవాడలో బీజేపీ నేతలు వెంకయ్యకు సన్మానం చేస్తే.. తాజాగా గుంటూరు జిల్లాలోని తెనాలి పట్టణంలో సన్మాన కార్యక్రమాన్నిపెట్టేశారు. సాధించింది ఏమీ లేకున్నా.. ఏదో చేసేసినట్లుగా కలర్ ఇస్తూ సన్మానాలు చేసుకోవటం వెంకయ్యకు.. చేయటం ఏపీ బీజేపీ నేతలకైతే.. చూస్తూ ఉండిపోవటం సీమాంధ్రులకు మాత్రమే సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Tags:    

Similar News