వెంకయ్యకు ఎంత ధైర్యం ఆ మాట చెప్పటానికి..?

Update: 2017-02-04 04:31 GMT
వాస్తవం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా చెబితే చాలామందికి కోపం వచ్చేస్తుంది. కానీ.. అది నిజమన్న విషయాన్ని మర్చిపోతారు. విభజన నేపథ్యంలో మొత్తంగా నష్టపోయిన ఏపీకి ఎన్నో చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ రోజు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారంటే.. అందుకు వెంకయ్యను తప్పు పట్టాలా? ఆయనకు అలా అలుసు ఇచ్చిన ఆంధ్రోళ్లను రెండు మాటలు అనాలా?

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న వేళ.. తెలంగాణ ప్రాంతానికి వచ్చి.. ఆ ప్రాంతానికి అది చేశాం.. ఇది చేశామన్న మాటలు చెప్పే ధైర్యం చేసే వాళ్లు కాదు. ఒకవేళ అలాంటి పనే చేయబోతే.. అలాంటి వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికి నిలదీసేవారు. ఇన్ని చేస్తామని చెప్పే మీరు.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఇవ్వరంటూ సూటిగా ప్రశ్నించేవారు. అయినా.. మీరు ఇచ్చేదేమిటి? తెలంగాణ ఇస్తే మేమే చేసుకుంటామనే వారు కూడా ఉండేవారు.

ఆంధ్రోళ్ల నోట ఈ తరహా నిలదీత అస్సలు కనిపించదు. అందుకే కాబోలు వెంకయ్య ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తున్నారు. తాజాగా విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పాడిందే పాడరా.. పాసిపళ్ల.. అన్నసామెతకు తగ్గట్లే.. ఏపీకి ఏదేదో చేసేసినట్లు గొప్పలు చెప్పేశారు. గడిచిన రెండున్నరేళ్లలో ఏపీకి ఎంతో చేశామని చెప్పిన ఆయన.. హోదాకు మించిన ప్రయోజనం జరగాలన్న ఉద్దేశంతో ఏపీకి రూ.2.2లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్లుగా చెప్పారు.

ఏ రాష్ట్రానికి రానన్ని ప్రాజెక్టులు.. సంస్థలు ఏపీకివస్తాయని చెప్పుకొచ్చారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.10.5లక్షల కోట్ల పెట్టుబడులు రావటం దేశ చరిత్రలోనే ప్రథమంగా అభివర్ణించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. వెంకయ్య నోటి నుంచి వచ్చిన మాటల్ని నమ్మినోళ్లు ఏపీకి ఏదో జరిగిపోతుందని అనుకోవటం ఖాయం. ఏపీ విషయంలో వెంకయ్య చెప్పిన మాటల్ని కాసేపు పక్కన పెట్టి.. మూడంటే మూడే ప్రశ్నలకు వెంకయ్య సూటిగా సమాధానాలు చెప్పగలరా? అని అడగాలనిపిస్తుంది.

అందులో మొదటి ప్రశ్నను చూస్తే.. ఏపీకి రూ.2.2లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్లుగా చెప్పారు కదా.. ఏపీకి ఎంతో మేలు చేద్దామన్నదే మీ ఉద్దేశం అయితే.. ఆ ప్యాకేజీకి ఇప్పటివరకూ ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు? ఇక.. రెండో ప్రశ్న.. విశాఖలో నిలబడి ఏపీకి ఏదో చేసేసినట్లుగా చెబుతున్నారు కదా. ఏపీ దాకా ఎందుకు విశాఖకు ఇస్తామన్న విశాఖ రైల్వే జోన్ ఇప్పటి వరకూ ఎందుకు పూర్తి చేయలేదు? ఇక.. మూడో ప్రశ్న విషయానికి వస్తే.. మొన్న జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ సర్కారు రూ.10.50లక్షల కోట్ల పెట్టుబడులు రావటం దేశ చరిత్రలోనే ప్రథమంగా.. నోరూరిపోయేలా మాట్లాడుతున్నారు. విశాఖలో జరిగిన సదస్సులో కేవలం ఒప్పందాలు మాత్రమే జరిగాయి. ఆ మాత్రం దానికే ‘‘పెట్టుబడులు రావటం’’ అంటూ మాటలు చెప్పేయటంలో అర్థమేంది? ఈ ఏడాది సంగతి తర్వాత.. గత ఏడాది ఒప్పందాలు చేసుకున్న రూ.5లక్షల కోట్ల చిల్లర పెట్టుబడుల్లో ఏపీకి వచ్చిన పెట్టుబడులు ఎన్ని?ఈ మూడు ప్రశ్నలకు ఇంతే సూటిగా వెంకయ్య కానీ సమాధానం చెబితే.. ఆయన చెప్పే మాటల్ని అందరూ నమ్మేయొచ్చు. మరి.. వెంకయ్య ఇలాంటి వాటికి రియాక్ట్ అవుతారా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News