వెంక‌య్య‌గారు వ‌దిలిన డైలాగ్‌ లు విన్నారా?

Update: 2016-05-08 09:26 GMT
ఆక‌ట్టుకునే మాట‌లకు పెట్టింది పేరైన బీజేపీ అగ్ర‌నేత - కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు మ‌రోమారు త‌న వాగ్దాటిని ప్ర‌ద‌ర్శించారు. తమిళనాడులో బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ "తమిళనాట అమ్మను - అయ్యను చూశారు. ఈ సారి మీ అన్న మోడీకి మద్దత్విండి'' అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు.  వెంకయ్యనాయుడు తన ప్రసంగాన్ని తమిళంలో ప్రారంభించి, మధ్యలో తెలుగులో కొనసాగించి, ఆంగ్లంలో ముగించారు.  తమిళం ప్రాచీన భాష అని, ఆ తమిళం తనకు కాస్తాకూస్తో తెలుసునని, అయితే చక్కగా ప్రసంగించలేనని చెబుతూ వీరపాండ్యకట్టబొమ్మన - పసుంపొన ముత్తురామ లింగదేవర్ - స్వదేశీ ఓడనడిపిన చిదంబరం పిళ్లై - మహాకవి సుబ్రహ్మణ్య భారతి - నిరాడంబర ముఖ్యమంత్రులు కామరా జనాడార్ అన్నాదురై వంటి మహానాయకులు - శివాజీ - ఎంజిఆర్ వంటి మహానటులను గుర్తు తెచ్చే తమిళనాట ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయనీ, ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.

దేశమంతా పురోగమన దిశ గా పయనిస్తుంటే తమిళనాడు తిరోగమన దిశగా పయనిస్తోందని వెంక‌య్య‌నాయుడు అన్నారు. తమిళనాట డీఎంకే-కాంగ్రెస్‌ ల మధ్య ఏర్పడిన కూటమి అపవిత్రమైన కూటమి అనీ విమర్శించారు. ప్రస్తుతం మార్పునకు సమయం ఆసన్నమైందని, కేంద్రం లో రెండేళ్లకు మునుపు ఏర్పడిన మంచి మార్పును, నెలకొల్పిన సమర్ధవం తమైన ప్రభుత్వాన్ని ప్రపంచదేశాలంతా గమనించి విస్తుపోతున్నాయన్నారు. అండమాన్ నికోబార్‌ లో, అరుణాచల్ ప్రదేశ్  తదితర రాష్ట్రాలలో బీజేపీ విజయబావుటా ఎగురవేస్తున్నదని, తమిళనాట కన్యాకుమారి జిల్లా బీజేపీకి కంచుకోటమారిందని, ఇప్పుడు కేరళలోనూ తమ పార్టీ ఖాతాను తెరవబోతున్నదనీ వెంక‌య్య‌నాయుడు జోస్యం చెప్పారు.

ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ కాదనీ, ఎన్నో చీలికలు పీలికలు ఏర్పడి మిగిలిన పార్టీ అనీ, ఇక వామపక్షాలకు పార్లమెంట్‌ లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని, ఈ రెండు పార్టీలూ ఢిల్లీ మే దోస్తీ... చెన్నై మే కుస్తీ అనే ద్వంద్వ వైఖరులను అవలంభిస్తున్నాయని విమర్శించారు. తమిళనాడు కోసం మోదీ ప్రభుత్వం స్మార్ట్ సిటీలు - హెరిటేజ్ సిటీలు వంటి విశిష్టమైన పథకాలను అందజేస్తోందనీ, ప్రజా సంక్షేమ పథకాలకు నిధులు భారీగా విడుదల చేస్తోందని చెప్పారు. తమిళనాట డీఎంకే - అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ యేనని, ఓసారి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళతామని, ఆ సత్తా తమకందరికీ ఉందనీ ఆయన చెప్పారు.
Tags:    

Similar News