చంద్ర గ్రహణమేనా : రాష్ట్రపతి అభ్యర్ధిత్వం దక్కక పోవడం వెనక ..?

Update: 2022-06-22 08:40 GMT
తెలుగు రాజకీయాల్లో చూస్తే ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు దిగ్గజ నేత. ఆయన మంచి వాగ్దాటి ఉన్న వారు. అలాగే కమ్యునికేషన్స్ స్కిల్స్ లో ఆయనకు తిరుగులేదు. జాతీయ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా ఉన్నారు. అక్కడే బాగా పండారు కూడా. అటువంటి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాల్సిన వారే. కానీ ఆయనకు లక్ కలసి రాలేదు అని అంటారు.

అయితే రాజకీయ కారణాలు కొన్ని కీలక సమీకరణలు  కూడా దీని వెనక ఉన్నాయా అన్న చర్చ వచ్చినపుడు మాత్రం తెలుగు రాజకీయాలను ఒక్కసారిగా నెమరువేసుకోవాల్సిందే. 1978లో జనతా పార్టీ నుంచి ఉదయగిరి అసెంబ్లీ సీటుకు  యువ వెంకయ్యనాయుడు అభ్యర్ధిగా గెలిచినపుడు మంచి ఉత్సావంతుడైన నాయకుడిగా నిరూపించుకున్నారు. నాడు అసెంబ్లీలో ఆయన ధాటీగా మాట్లాడేవారు. ఇక 1983 నాటికి ఆయన బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా రెండవ పర్యాయం గెలిచారు.

1984లో ఎన్టీయార్ ని కాంగ్రెస్ గద్దె నుంచి దించేసినపుడు వెంకయ్యనాయుడు ప్రజా పరిరక్షణ పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించారు. అలా టీడీపీలో ప్రత్యక్ష దోస్తీ బీజేపీ చేయడానికి ఆయన ప్ర‌యత్నం చాలానే చేశారు. ఇక ఆ తరువాత ఆయన మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. ఉమ్మడి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. చాలా కాలం తరువాత ఢిల్లీ వెళ్ళి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా వాజ్ పేయ్ హయాంలోనూ అలాగే మోడీ టైమ్ లో కూడా పనిచేశారు.

ఇంతలా వెలిగిన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక అయినపుడు మాత్రం రాజకీయాల నుంచి పక్కన పెడుతున్నారు అన్న బాధ అందరిలో కలిగింది. అయితే బీజేపీ వారు మోడీ నాయకత్వాన మొదట్లో ఆయనకు పెద్ద పీట వేసినా తరువాత కాలంలో ఆయన్ని సైడ్ ట్రాక్ పట్టించడానికి కారణం నాటి ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న గట్టి  స్నేహ బంధాలే అని అంటారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నా బీజేపీ నేతగా ఉన్నా ఏపీలో తెలుగుదేశం పట్ల సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరించారు అన్న అనుమానాలు బీజేపీ పెద్దలలో ఉన్నాయని చెబుతారు.

ఇక మరో ముచ్చట కూడా చూడాలి వెంకయ్యనాయుడు రాజ్యాంగ బద్ధమైన పదవిలోకి వెళ్ళాక మరుసటి ఏడాదే టీడీపీ బీజేపీతో బంధాన్ని తెంచుకుంది. ఆ మీదట నుంచి నేటి వరకూ బాబు మనసు మారినా బీజేపీ పెద్దలు కనికరించడంలేదు. దీనికంతటికీ కారణం చంద్రబాబు మీద బీజేపీ పెద్దలకు ఉన్న  కోపం అని అంటారు. అదే ఇపుడు వెంకయ్యనాయుడు రాష్ట్రపతి పదవికి కూడా అడ్డుగా మారిందని విశ్లేషణలు కూడా వస్తున్నాయి.

నిజానికి అన్ని పార్టీలతో అందరి నేతలతో వెంకయ్యనాయుడు సాన్నిహిత్యంగా ఉంటారు. చంద్రబాబుతో అయితే కొంచెం ఎక్కువ దోస్తీ ఉందని చెబుతారు. ఇక ఒకే సామాజిక వర్గం కావడం,  ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రో టీడీపీ స్టాండ్ ఇవన్నీ కలసి ఏపీ రాజకీయాల పట్ల కేంద్ర పెద్దలకు ఒక అభిప్రాయాన్ని కలిగించాయని అంటారు.

ఏది ఏమైనా వెంకయ్యనాయుడు రాష్ట్రపతి పదవికి యోగ్యుడైన వారే కానీ అనేక సమీకరణలు ఆయనకు ఆ పదవికి దక్కనీయకుండా చేశాయని అంటారు. ఇపుడు యాంటీ టీడీపీ మీడియా అయితే చంద్రబాబు వల్లనే ఉన్నతాసనం పెద్దాయనకు దక్కలేదని, దానికి టీడీపీ అనుకూల మీడియా చేసిన అతి కూడా ప్రధాన కారణమని చెబుతోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ మొత్తానికి పెద్దాయన అధికార వైభోగం అయితే ఆగస్టుతో ఉపరాష్ట్రపతి పదవితో ముగియనుంది అనే అంటున్నారు.
Tags:    

Similar News