వెంక‌య్య‌నాయుడు పొర‌పాటున అన్న‌ది నిజ‌మైంది

Update: 2016-05-14 07:49 GMT
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈసారి ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లాలన్న తన ప్రయత్నాలు మానుకున్నారట. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఈసారి కూడా మళ్లీ అదే రాష్ట్రం నుంచి ఎంపికయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  1998 నుండి మూడు సార్లుగా పొరుగు రాష్ట్రం కర్ణాటక నుండే రాజ్యసభ సభ్యునిగా ఎన్నికౌతున్న ఆయన పదవీకాలం వచ్చే నెల 29వ తేదీతో ముగియనుంది. బిజెపిలో మూడు పర్యాయాలకు మించి ఎవరికీ రాజ్యసభ సభ్యత్వం కల్పించరాదన్న సంప్రదాయం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పాత్ర పోషి స్తుండడం వల్ల ఆయనకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ - బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నిర్ణయించినట్లు తెలియ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి ఆయన ఏపీ నుంచి టీడీపీ మద్దతుతో ఎన్నికవుతారని అంతా భావించారు. కానీ... ప్రత్యేక హోదా విషయంలో ఏపీలోని విపక్షాలు - ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న తరుణంలో ఇక్కడి నుంచి ఎన్నికయితే తనపై ఆ బాధ్యతలు మరింత పెరుగుతాయన్న భయంతో వెంకయ్య మళ్లీ కర్ణాటకకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

కర్ణాటకకు రాష్ట్రేతరుడైన వెంకయ్యనాయుడుకు అక్కడి నుంచి నాలుగోసారి రాజ్యసభ సభ్యత్వం కల్పించడం పట్ల ఆ రాష్ట్ర బీజేపీలో కొంత వ్యతిరేకత వ్యక్తమౌతున్నప్పటికీ ఇటీవలే కర్ణాటక బిజెపి అధ్యక్షునిగా ఎంపికైన సీనియర్‌ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మద్దతును కూడగట్టడంలో వెంకయ్యనాయుడు సఫలీకృతమయ్యారని.. సో... నాలుగోసారి కూడా కర్ణాటక నుంచే రాజ్యసభకు వెళ్తారని తెలుస్తోంది. నిజానికి కర్ణాటకలోనూ వెంకయ్యపై వ్యతిరేకత ఉంది. కర్ణాటక శాసనసభలో బిజెపి సంఖ్యా బలాన్ని బట్టి ఈసారి  ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క స్థానం లభించే అవకాశం ఉండడం, వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్రానికి చెందిన మరో నాయకుడు ఆయనార్‌ మంజునాధ గౌడ్‌ కూడా అదే రోజున రిటైరవుతుండడం... దీనికితోడు, ఇప్పటికే మరో స్థానంలో తమిళనాడుకు చెందిన నాయకునికి అవకాశం కల్పించి ఉండడాన్ని ప్రస్తావిస్తూ ఆ ఒక్క స్థానాన్ని రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులకే ఇవ్వాలనే వాదన అక్కడ బలంగా వినిపిస్తోంది. కానీ, యడ్యూరప్ప, బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నేతల నోరు నొక్కి వెంకయ్యకు అక్కడి నుంచి మరో ఛాన్సు ఇస్తున్నట్లుగా సమాచారం.

నిజానికి కర్ణాటక నుంచే మూడు సార్లు రాజ్యసభకు వెళ్లడంతో అక్కడ తన పట్ల వ్యతిరేకత ఉందని గుర్తించిన వెంకయ్య ఏపీ లేదా మధ్య ప్రదేశ్ నుంచి వెళ్లాలనుకున్నారు. కానీ.. ఇటీవల ఏపీలో వెంకయ్య అంటే జనం మండిపడుతున్నారు. మిత్రపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు మంచి మిత్రుడే అయినా ఆ పార్టీ నేతల్లో కొందరు వెంకయ్యను వ్యతిరేకిస్తున్నారు. విపక్షాలు కూడా ప్రత్యేక హోదా విషయంలో ఆయన్ను కౌంటర్ చేస్తున్నాయి. ఏపీకి రావాల్సిన ప్రయోజనాల విషయంలోనూ వెంకయ్యను టార్గెట్ చేస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో ఆయన తాను ఏపీ వాడినైనా కర్ణాటక నుంచి గెలిచానని.. దేశం కోసం పనిచేయాలి కానీ, ఒక్క ఏపీ కోసమే కాదని చెప్పి తప్పించుకుంటున్నారు. ఒకవేళ ఏపీ నుంచి గెలిస్తే అలా తప్పించుకునే అవకాశాలు తగ్గుతాయి. దీంతో అవన్నీ ఆలోచించి ఆయన ఏపీ నుంచి కాకుండా కర్ణాటక లేదా మధ్య ప్రదేశ్ నుంచి వెళ్లాలని అనుకుంటున్నారట. ఇటీవల వెంకయ్యే స్వయంగా బీజెపి శాసనసభ్యుల సంఖ్య అతి తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నుండి తాను రాజ్యసభకు ఎన్నికయ్యే సమస్యే లేదని  ప్రకటించారు. దీంతో ఆయన మధ్యప్రదేశ్ - కర్ణాటకల్లో ఏదో ఒక రాష్ట్రం నుంచి వెళ్తారని తెలుస్తోంది. అయితే, కర్ణాటకలో వెంకయ్యమిత్రుడు యడ్యూరప్ప ఉండడంతో అక్కడి నుంచే రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఎక్కువని సమాచారం.

Tags:    

Similar News