హ‌నుమంత‌న్న‌కు షాక్ త‌ప్ప‌దా.. మాణిక్కంపై సీరియ‌స్ కామెంట్లు!

Update: 2021-06-13 16:30 GMT
తెలంగాణ పీసీసీ పీఠం ఎవ‌రికి ద‌క్కుతుంద‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారి.. తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌ను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ నుంచి వ‌చ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. రేవంత్ రెడ్డికి ఈ ప‌ద‌వి ఇచ్చే ఛాన్స్ ఉంద‌ని కొన్నాళ్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఇక‌, ఇప్పుడు ఎంపిక తుది క‌స‌ర‌త్తుకు చేరుకుంది. ఈ నేప‌థ్యంలో ఇదే విష‌యంపై కొన్ని రోజులుగా ఆగ్ర‌హంతో ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు వి. హ‌నుమంత‌రావు.. ఉర‌ఫ్ హ‌నుమంత‌న్న‌.. రేవంత్‌రెడ్డిని ఎలా ఎంపిక చేస్తారంటూ..(ఇంకా ఫైన‌ల్ కాక‌పోయినా..) విరుచుకుప‌డ్డారు.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌పై వీహెచ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. పీసీసీ చీఫ్ ఎవరన్న దానిపై మాణిక్కం ఒక్కరే అభిప్రాయ సేకరణ చేస్తారా? అని ప్ర‌శ్నించారు. పీపీసీ కోసం పరిశీలకుడిని ఎందుకు పంపించడం లేదని హైమాండ్‌ను సైతం నిల‌దీశారు. బీజేపీ ప్రధాన కార్యదర్శులు రాష్ట్రానికి వస్తే పార్టీ బలోపేతం కోసం కష్టపడుతున్నారని.. కానీ కాంగ్రెస్‌లో ఆ పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్‌కి ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయడం లేదని ధ్వజమెత్తారు.

బయట నుంచి వచ్చిన వారికి(రేవంత్‌) పీపీసీ చీఫ్ పదవి ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని.. అలా జరిగితే తమ ఆత్మగౌరవం దెబ్బ తినదా అని వీహెచ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే.. మొదటి నుంచి ఉన్న వారి పరిస్థితి ఏంటన్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న లాయలిస్టులకే పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీసీసీ గురించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లెటర్ రాశానని చెప్పారు.

ఇక‌, పార్టీ నుంచి తనను సాగనంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా వీహెచ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి తాను పదవుల కోసం రాలేదని.. సామాజిక న్యాయం కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు వీహెచ్ కామెంట్లు తెలంగాణ కాంగ్రెస్‌లోనే కాకుండా రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిగా మారాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇదిలావుంటే.. రాజీవ్ గాంధీ హ‌యాం నుంచి కూడా వీహెచ్ గాంధీల కుటుంబానికి ఎంతో ఆప్తునిగా ఉన్న విష‌యం తెలిసిందే.







Tags:    

Similar News