సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు!

Update: 2022-12-03 10:05 GMT
న్యాయమూర్తుల నియామకం, బదిలీపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు న్యాయమూర్తుల నియామకం, బదిలీలు వంటివన్నీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కొలీజియం చూస్తున్న సంగతి తెలిసిందే. కొలీజియం సూచనలు, సిఫారసుల ఆధారంగానే కేంద్రం న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో చర్యలు చేపడుతోంది.

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ఉద్దేశించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుప్రీంకోర్టు.. దానిని కొట్టేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ)ని సుప్రీం కోర్టు రద్దు చేయడంపై దేశ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కర్‌  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌జేఏసీ సుప్రీం కోర్టు కొట్టివేశాక పార్లమెంటులో దీనిపై ఎటువంటి చర్చ జరగకపోవడం సరికాదన్నారు. ఇది చాలా తీవ్రమైన సమస్య అని జగదీప్‌ ధన్‌కర్‌ అభిప్రాయపడ్డారు.

తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన జగదీప్‌ ధన్‌కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సమక్షంలోనే ఉపరాష్ట్రపతి ధన్‌కర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పార్లమెంట్‌ ఒక చట్టం చేసిందంటే.. అది ప్రజల ఆకాంక్ష మేరకే ఉంటుందని ఉపరాష్ట్రపతి చెప్పారు. చట్టమనేది ప్రజల శక్తి అని అన్నారు. అలాంటి దానిని సుప్రీం కోర్టు రద్దు చేసిందని ఆక్షేపించారు.

ఈ సందర్బంగా రాజ్యాంగంలోని పలు నిబంధనలను ఉటంకించిన జగదీప్‌ ధనకర్‌.. చట్టం పరిధిలో ముఖ్యమైన ప్రశ్న ఇమిడి ఉన్నప్పుడు... ఆ సమస్యను కోర్టులు పరిశీలించవచ్చని అన్నారు. అయితే.. ఆ నిబంధనను రద్దు చేయవచ్చని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. ఈ క్రమంలో జగదీప్‌ ధనకర్‌ రాజ్యాంగ పీఠికను సైతం ప్రస్తావించారు.

జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ ఏర్పాటు చట్టం.. లోక్‌సభ, రాజ్యసభ రెండు సభల్లోనూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఓటింగ్‌ ద్వారా ఆమోదం పొందిందని ధన్‌కర్‌ గుర్తు చేశారు. ఇలా పార్లమెంటు ఆమోదం ద్వారా చట్టం అయినదాన్ని కొట్టేయడం సరికాదన్నారు. కాబట్టి తాను మేధావులను, న్యాయకోవిదులను కోరేది ఒక్కటేనన్నారు. రాజ్యాంగ నిబంధనను రద్దు చేయగల ఈ ప్రపంచంలో ఒక సమాంతర వ్యవస్థను కనుక్కోండి అంటూ ఉపరాష్ట్రపతి హాట్‌ కామెంట్స్‌ చేశారు.

కాగా ఇటీవల నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కూడా ఉప రాష్ట్రపతి ధన్‌కర్‌ దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News