వెంకయ్యనాయుడు : చివరి సమావేశాలు అవే... ఆ తరువాత...?

Update: 2022-07-18 02:30 GMT
భారత ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు తొందరలోనే మాజీ కాబోతున్నారు. ఆయన ఆగస్ట్ 10తో పదవీ విరమణ చేయనున్నారు. 2017లో ఆయన అనూహ్యంగా ఉప రాష్ట్రపతి అయ్యారు. కేంద్ర మంత్రిగా తాను ఉన్న పదవిలో బాగా ఉన్నాను, మరిన్నాళ్ళ పాటు క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతాను అని వెంకయ్యనాయుడు చెప్పినప్పటికీ బీజేపీ అధినాయక‌త్వం పట్టుబట్టి మరీ  ఆయన్ని ఉప రాష్ట్రపతిని చేసింది. ఇక రాజ్యసభ చైర్మన్ గా వెంకయ్యనాయుడు తన సమర్ధతను చాటుకున్నారు.

పాలకపక్షం బీజేపీకి రాజ్యసభలో మొదట్లో మెజారిటీ లేకపోయినప్పటికీ ఆయన తన చతురతతో సభను సజావుగా నిర్వహించడమే కాదు, ప్రభుత్వ బిల్లులు చాలా వరకూ పాస్ అయ్యేలా చూశారు. వెంకయ్యనాయుడు ఒక దశలో రాష్ట్రపతి అవుతారు అని కూడా అంతా భావించారు. కానీ దేశంలో ఆదివాసీ మహిళకు చాన్స్ ఇవ్వాలని బీజేపీ భావించడంతో ఆయనకు ఆ అవకాశం దక్కలేదు.

ఇక ఉప రాష్ట్రపతిగా ఆయననే మరోసారి కంటిన్యూ చేస్తారు అన్న మాట కూడా వినిపించింది. కానీ ఎవరూ అనుకోని విధంగా జగదీప్ ధన్ కర్ ని ఎంపిక చేశారు. దాంతో వెంకయ్యనాయుడు మాజీ అవుతున్నారు. ఇక ఆయన రాజ్యాంగబద్ధమైన రాజకీయ జీవితం కూడా ముగింపు దశకు చేరింది. వెంకయ్యనాయుడు తెలుగు వారిగా ఉంటూ ఢిల్లీలో తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన భారత దేశాన సౌత్ ఫేస్ గా గుర్తింపు పొందారు. మూడు సార్లు ఆయన్ని కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నుకున్నారు. కేంద్రంలో వాజ్ పేయ్ ప్రభుత్వంలోనూ, ఆ మీదట మోడీ సర్కార్ ఏలుబడిలోనూ కీలకమైన మంత్రిత్వ శాఖలను చేపట్టారు.

ఒక విధంగా వెంకయ్యనాయుడు జనంతోనే ఉంటూ సభలలో రజింపచేసే ప్రసంగాలు చేయడంతో పేరు సంపాదించుకున్నారు. ప్రాసలతో కూడిన ఉపన్యాసాలు ఆయన శైలి. మరి ఆయన పదవీ విరమణ తరువాత ఏం చేస్తారు అన్నది పెద్ద చర్చగా ఉంది. దేశంలో అతి పెద్దదైన రెండవ రాజ్యాంగ పదవిని నిర్వహించిన వెంకయ్యనాయుడుకు ఇక అంతకంటే వేరే పదవులు దక్కే అవకాశాలు లేవు. ఇక సంప్రదాయం బట్టి చూసినా ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే చాన్స్ కూడా లేదు.

దాంతో మాజీ ఉప రాష్ట్రపతిగా ఆయన ఢిల్లీలో కేంద్రం తనకు కేటాయించిన అధికార నివాసంలో తన మిగిలిన జీవితాన్ని కొనసాగిస్తారు అని అంటున్నారు. ఇక ఆగస్ట్ 10తో వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. అంటే ప్రస్తుత వర్షకాల సమావేశాల మధ్యలోనే ఆయన రిటైర్ అవుతారన్న మాట.
Tags:    

Similar News