చంద్ర‌బాబు ఈ వ‌య‌సులో ఆ ప‌ని చేయ‌లేక‌.. ఏపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-09-13 00:30 GMT
ఏపీ వైద్య ఆ రోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ``ఈ వ‌య‌సులో చంద్ర‌బాబు పాద‌యాత్ర చేయ‌లేక‌.. రాజ‌ధాని రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నారు`` అని వ్యాఖ్యానించారు. అయితే.. మూడు రాజధానుల విషయంలో ఎవరెన్ని కుట్రలు చేసినా వెనుకడుగేసే ప్రసక్తే లేదని మంత్రి తేల్చిచెప్పారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తంగుడుబిల్లిలో జగనన్న మెగా కాలనీకి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో మంత్రి మాట్లాడుతూ.. టీడీపీపైనా.. అమ‌రావ‌తి ఉద్య‌మంపైనా.. చంద్ర‌బాబుపైనా విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ వయస్సులో చంద్రబాబు పాదయాత్రలు చేయలేక.. రైతులతో చేయిస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానులు ప్రజాప్రయోజనాల కోసమే తప్ప.. చంద్రబాబులా స్వప్రయోజనాలకు కాదని మంత్రి వ్యాఖ్యానించారు. ``రాజ‌ధానిలో ఏముంది?  నాలుగు భ‌వ‌నాలు క‌ట్టేస్తే.. అదే రాజ‌ధానా?  దీనిని చంద్ర‌బాబు అనుకూల వ‌ర్గాలు భూత‌ద్దంలో పెట్టి మ‌రీ చూపిస్తున్నాయి.

పేద‌ల‌కు.. అక్క‌డ ఇళ్లు ఇస్తామంటే.. అడ్డుకునేవారు.. అమ‌రావ‌తి రాజ‌ధాని రాష్ట్రం మొత్తానిది.. అని ఎలా చెబుతారు?  రాష్ట్రం మొత్తానికిఅమ‌రావ‌తి రాజ‌ధాని అయితే.. అక్క‌డ పేద‌ల‌కు మన ప్ర‌భుత్వం ఇస్తున్న ఇళ్ల‌ను వ‌ద్దనేవారు కాదు. కానీ, అమ‌రావ‌తి వెనుక కుట్ర ఉంది. అందుకే పేద‌ల‌కు అక్క‌డ ఇళ్లు ఇస్తుంటే.. చంద్ర‌బాబు అడ్డుకుంటున్నారు`` అని మంత్రి వ్యాఖ్యానించారు.

కాగా, "నవరత్నాలు-అందరికీ ఇళ్లు"లో భాగంగా 596 ఎకరాల భూమిలో సుమారు 17 వేల ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి విడదల రజ‌నీ చెప్పారు.  ఈ కాలనీలను సంవత్సర కాలంలోనే పూర్తి చేస్తామని.. మౌలిక వసతుల కల్పనకు మరో ఏడాది పడుతుందన్నారు. ఇళ్ల నిర్మాణాలను ప్రైవేటు సంస్థకు అప్పగించామని.. సకాలంలో పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో మూడు రాజ‌ధానులు వ‌స్తాయ‌ని.. దీంతోనే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ది చెందుతాయ‌ని మంత్రి చెప్పారు. అయితే.. ఉద్దేశ పూర్వ‌కంగా.. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టి.. రాజ‌ధాని పేరుతో చిచ్చు పెట్టే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని.. అమ‌రావ‌తి రైతుల‌పైనా మంత్రి వ్యాఖ్య‌లు గుప్పించారు.

ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు చేసినా..సీఎం జ‌గ‌న‌న్న సంక‌ల్పం నెర‌వేరుతుంద‌ని మంత్రి ర‌జ‌నీ చెప్పారు. ఈ విష‌యంలో వెనుక‌డుగు వేసే ప్ర‌శ్నేలేదన్నారు. ``కొన్ని నిర్ణ‌యాలు అమ‌లు చేసేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. కానీ, అవి త‌ప్ప‌కుండా అమ‌ల‌వుతాయి. ఈ విష‌యంలో ప్ర‌జ‌లు ఎవ‌రూ అధైర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో పేద‌ల‌కు జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం సంక్షేమాన్ని అమ‌లు చేస్తోంది. దీనినికూడా ఓర్చుకోలేక పోతున్న కొంద‌రు నాయ‌కులు.. చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు`` అని ప‌రోక్షంగా మూడు రాజ‌ధానుల‌పై ఆమె వ్యాఖ్యానించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News