మాల్యా కార్లు ఎంత చౌక అంటే..!

Update: 2017-08-29 04:56 GMT
లిక్క‌ర్ కింగ్ గా.. కింగ్ ఫిష‌ర్ ఎయిర్ లైన్స్ అధినేత‌గా పేరున్న విజ‌య్ మాల్యా ఆస్తులు ఒక్కొక్క‌టి వేలానికి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. బ్యాంకుల వ‌ద్ద తీసుకున్న రూ.9వేల కోట్ల బ‌కాయిల్ని చెల్లించ‌కుండా విదేశాల‌కు వెళ్లిపోయిన అత‌ని ఆస్తుల్ని ఒక్కొక్క‌టిగా వేలానికి పెడుతున్నారు.

ఈ మ‌ధ్య‌న ఆయ‌న‌కు సంబంధించిన విల్లాల‌ను వేలానికి పెడితే ఒక్క‌రు కూడా కొన‌ని ప‌రిస్థితి. ఇందుకు భిన్నంగా మ‌ల్యా వాడిన ఖ‌రీదైన కార్ల‌ను కారుచౌక‌గా వేలంలో సొంతం చేసుకున్న వైనం బ‌య‌ట‌కు రావ‌ట‌మే  కాదు.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌ల మాల్యా వాడిన రెండు కార్ల‌ను ఆన్ లైన్లో వేలం వేశారు. ముంబ‌యి నుంచి నిర్వ‌హించిన ఈ ఆన్ లైన్ వేలంలో మాల్యా వాడిని హ్యుండ‌య్ సొనాటా గోల్డ్‌.. హోండా ఎకార్డ్ ల‌ను వేలం వేశారు. మార్కెట్లోలో సొనాటా గోల్డ్ విలువ రూ.13.15 ల‌క్ష‌లు కాగా.. హోండా ఎకార్డ్ విలువ రూ.21 ల‌క్ష‌లు.

అయితే.. ఆన్ లైన్లో వేలం వేసిన ఈ కార్ల‌ను ఎవ‌రూ క‌ల‌లో కూడా ఊహించ‌నంత త‌క్కువ ధ‌ర‌కు అమ్మేశారు.  మాల్యాకార్ల‌ను అత్యంత త‌క్కువ దొర‌కు సొంతం చేసుకున్నారు క‌ర్ణాట‌క‌లోని హుబ్లీకి చెందిన హ‌నుమంత‌రెడ్డి అనే వ్యాపార వేత్త‌. హ్యుండాయ్ సోనాటా గోల్డ్ ను రూ.40వేల‌కు.. ఎకార్డ్ ను రూ.ల‌క్ష‌కే సొంతం చేసుకోవ‌టం విశేషం. మాల్యా వాడిన రెండు కార్ల మార్కెట్ విలువ దాదాపు రూ.34 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంటే.. హ‌నుమంత రెడ్డి మాత్రం కేవ‌లం రూ.1.4ల‌క్ష‌ల‌కే సొంతం చేసుకోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

కారు చౌక‌కు మాల్యా కార్ల‌ను సొంతం చేసుకున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చి.. ఇప్పుడా కార్ల‌ను మూడింత ఎక్కువ ధ‌ర చెల్లిస్తామ‌ని చెబుతున్న‌ట్లుగా హ‌నుమంత‌రెడ్డి చెబుతున్నారు. మాల్యా వాడిన కార్లుగా చెబుతున్న కార్లు మంచి కండీష‌న్లో ఉన్నాయ‌ని చెబుతున్న ఆయ‌న‌.. ఆన్ లైన్లో రోల్స్ రాయిల్స్ మొద‌లు అనేక ల‌గ్జ‌రీ మోడ‌ళ్లు అందుబాటులో ఉన్నాయ‌ని.. కాకుంటే వాటి ధ‌ర‌లు భారీగా ఉన్నాయ‌న్నారు. త‌క్కువ ధ‌ర‌కు ఉండ‌టంతో తాను మాల్యా కార్ల‌నుకొనుగోలు చేసిన‌ట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News