డొల్ల కంపెనీల‌తో కొల్ల‌గొట్టిన మాల్యా!

Update: 2017-09-26 06:58 GMT
స‌గ‌టు జీవి బ్యాంకుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి అప్ప అడిగితే ఎలాంటి అనుభ‌వం ఎదుర‌వుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అదే బ్యాంకు.. బ‌డా వ్యాపారుల విష‌యంలోనూ.. కార్పొరేట్ సంస్థ‌ల అధిప‌తుల విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న‌టానికి పేరుకుపోయిన బ‌కాయిల జాబితాను చూస్తే తెలుస్తుంది. లిక్క‌ర్ కింగ్ గా సుప‌రిచితుడైన‌ కింగ్‌ ఫిష‌ర్ విజ‌య్ మాల్యా  వేలాది కోట్ల రూపాయిల్ని బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకొని.. వాటిని ఎగ్గొట్టి ఎంచ‌క్కా విదేశాల‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. అదేమంటే.. తానేమీ మోసం చేయ‌లేద‌ని.. వ్యాపారం చేసి న‌ష్ట‌పోయిన‌ట్లుగా గొప్ప‌లు చెప్పుకుంటున్నారు.

విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డుపుతున్న విజ‌య్ మాల్యాను దేశానికి తిరిగి తెచ్చేందుకు అధికారులు కిందామీదా ప‌డుతున్నా.. సాధ్యం కావ‌టం లేదు.ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంత‌కీ మాల్యాకు అన్నేసి వేల కోట్ల రూపాయిల్ని బ్యాంకుల నుంచి ఏ విధంగా స‌మీక‌రించార‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌. తాజాగా దీనికి స‌మాధానం దొరికింది.

వివిధ బ్యాంకుల నుంచి మాల్యా స‌మీక‌రించిన భారీ మొత్తంలో దాదాపు రూ.6027 కోట్లు ఏకంగా డొల్ల కంపెనీల నుంచి వ‌చ్చిన‌ట్లుగా గుర్తించారు.

డొల్ల కంపెనీల ద్వారా స‌మీక‌రించిన కోట్లాది రూపాయిల్ని అమెరికా.. బ్రిట‌న్‌.. ఫ్రాన్స్ తో స‌హా ఏడు దేశాల్లోని బ్యాంకుల త‌ర‌లించిన‌ట్లుగా గుర్తించారు. తాజాగా ల‌భించిన వివ‌రాలు మాల్యాను భార‌త్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు తాజా ఆధారాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. డొల్ల కంపెనీల‌ను గుర్తించే కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున చేప‌ట్టిన మోడీ స‌ర్కారు తాజాగా మ‌రో రెండు ల‌క్ష‌ల కంపెనీల మీద.. ఆ డైరెక్ట‌ర్ల మీద‌ వేటు వేసింది.  దీంతో.. ఇప్ప‌టివ‌ర‌కూ వేటు వేసిన డొల్ల కంపెనీ డైరెక్ట‌ర్ల‌ సంఖ్య 3 ల‌క్ష‌ల‌కు చేరుకుంది.  ఇలా వేటు ప‌డిన డైరెక్ట‌ర్లు వేరే కంపెనీల్లో ఐదేళ్ల వ‌ర‌కూ చేరే అవ‌కాశం ఉండ‌దు.

ఇలా వేటు ప‌డిన డైరెక్ట‌ర్లు కొంద‌రు కొన్ని లిస్టెడ్ కంపెనీల్లోనూ డైరెక్ట‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న చ‌ర్య‌ల‌తో లిస్టెడ్ కంపెనీల నుంచి సైతం డైరెక్ట‌ర్లు వైదొల‌గాల‌న్న ఒత్తిడి పెరుగుతోంది.

మ‌రోవైపు.. డొల్ల కంపెనీల‌తో పాటు ఖాతాల్ని స‌రిగా నిర్వ‌హిస్తున్న కంపెనీల‌పైనా ప్ర‌భుత్వం దృష్టి పెట్ట‌నుంది.  నిబంధ‌న‌లు పాటించే కంపెనీల ఆర్థిక వ్య‌వ‌హారాల్ని.. నిధుల ప్ర‌వాహాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యించింది. ఈ ప్ర‌క్రియ పూర్తి అయ్యాక ఎలాంటి కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News