మాల్యా వ‌చ్చుడేమో కానీ..జైలు గ‌ది రెఢీ !

Update: 2017-08-14 09:56 GMT
ఈ దేశంలో చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంది. నిజానికి ఈ స్టేట్ మెంట్‌ను ఎప్పుడు.. ఏ సంద‌ర్భంలో అయినా ఇట్టే వాడేయొచ్చు. ఎక్క‌డా.. ఎలాంటి ఇబ్బంది రాదు. నిత్యం చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోయే ఈ దేశంలో చ‌ట్టం ముందు అంద‌రూ స‌మానులే.కానీ.. కొంద‌రు మాత్రం ఎక్కువ స‌మానులు అన్న భావ‌న క‌లిగేలా కొన్ని ఉదంతాలు చోటు చేసుకుంటాయి.

వేలాది కోట్ల రూపాయిలు బ్యాంకుల‌కు ఎగ్గొట్టిన పెద్ద మ‌నిషి మీద చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశాలు ఉన్న‌ప్పుడు.. నిఘా వ్య‌వ‌స్థ‌లు ఎలా ప‌ని చేయాలి? ఎంత అప్ర‌మ‌త్తంగా ఉండాలి. వేలాది కోట్ల రూపాయిల జాతి జ‌నుల సొమ్మును దోచేసినోడికి సంకెళ్లు వేసి చిప్ప‌కూడు తినిపించే విష‌యంలో వ్య‌వ‌స్థ‌లు ఎంత క్ర‌మ‌బ‌ద్ధ‌త‌తో ప‌ని చేయాలి. కానీ.. అలాంటిదేమీ దేశంలో క‌నిపించ‌దు. వ్య‌వ‌స్థ‌లోని లోపాల్ని అస‌రా చేసుకొని కొంద‌రు టైం చూసుకొని మ‌రీ దేశం విడిచి పారిపోతుంటారు. లిక్క‌ర్ కింగ్ గా చెప్పే విజ‌య్ మాల్యా కూడా ఇదే తీరులో వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి.

వేలాది కోట్లు బ్యాంకుల‌కు ఎగ్గొట్టిన అత‌గాడు బ్రిట‌న్‌కు పారిపోయి.. ఎంత ద‌ర్జాగా క్రికెట్ మ్యాచ్ లు చూస్తున్నాడ‌న్న విష‌యం టీవీల్లో చూసిందే. మీడియా అడిగిన‌ప్ర‌శ్న‌ల‌కు ఎలాంటి బాధ లేకుండా తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేదంటూ చేస్తున్న వాద‌న విన్న ప‌లువురిని విస్మ‌యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే..తాజాగా మాల్యాను ఎలా అయినా భార‌త్ తీసుకురావాల‌న్న ప్ర‌య‌త్నాలు ఈ మ‌ధ్య‌న పెరిగాయి. అనుకున్నట్లే జ‌రిగితే మాల్యాను తిరిగి ర‌ప్పించిన ప‌క్షంలో అత‌డ్ని ముంబ‌యిలోని అర్థ‌ర్ రోడ్ జైల్లో ఉంచాల‌ని భావిస్తున్నారు.

మ‌రి.. మాల్యా లాంటి నెంబ‌ర్ వ‌న్ కేటుగాడు బ‌స చేసే జైలుస్థితిగ‌తులు.. భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌పై కేంద్రం లండ‌న్ కోర్టుకు తాజాగా నివేదిక అందించింది. మాల్యాకు అర్థ‌ర్ రోడ్డు లో ఉన్న జైల్లోని బ్యార‌క్ 12ను కేటాయిస్తార‌ని చెబుతున్నారు. ఇదే బ్యార‌క్ లో గ‌తంలో ముంబ‌యి పేలుళ్ల‌లో అరెస్ట్ అయిన ఉగ్ర‌వాది అజ్మ‌ల్ క‌స‌బ్ ఉన్నాడు. ముంబ‌యి మ‌హ‌ల‌క్ష్మి రేసుకోర్సుకు స‌మీపంలో ఉన్న ఈ జైల్లో మాల్యాకు అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌మాణాలు ఉన్న‌ట్లుగా లండ‌న్ కోర్టుకు స‌మ‌ర్పించిన నివేదిక‌లో ప్ర‌భుత్వం పేర్కొంది. కేంద్రం నివేదిక నేప‌థ్యంలో లండ‌న్‌కోర్టు మాల్యాను భార‌త్‌కు అప్ప‌గించే ప్ర‌క్రియ‌ను మ‌రింత స్పీడ్ అప్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News