ధర్మకర్తనా .. అధర్మకర్తనా? అశోక్ గజపతి రూ.8వేల కోట్లు దోచారా?

Update: 2021-09-04 04:30 GMT
ఘాటు వ్యాఖ్యలు.. సూటి విమర్శలు.. చురుకు పుట్టించేలా మాట్లాడటం వైసీపీ రాజ్యాసభ సభ్యుడు విజయసాయికి అలవాటే. తాజాగా ఆయన మాజీ కేంద్రమంత్రి.. సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజుపై ఆయన తీవ్రంగా స్పందించారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజు అక్కడి ఆస్తుల్ని కాపాడాల్సింది పోయి.. అందుకు భిన్నంగా రూ.8వేల కోట్లు విలువైన భూములను దోచుకున్నట్లుగా ఘాటైన ఆరోపణలు చేశారు.

గడిచిన కొంతకాలంగా అశోక్ గజపతి రాజుపై సంచలన వ్యాఖ్యలు.. ఆరోపణలు చేసే ఆయన తాజాగా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజుపై తీవ్ర వ్యాఖ్యలే కాదు సూటి సవాలు సంధించారు. దేవుడి ఆస్తుల్ని కొల్లగొట్టటంలో అశోక్ గజపతి పాత్రపై అనుమానాల్ని వ్యక్తం చేసిన ఆయన.. మాన్సాస్ కు చెందిన రూ.8వేల కోట్ల ఆస్తులు అన్యాక్రాంతమైనట్లుగా వ్యాఖ్యానించారు.

''రూ.8వేల కోట్ల విలువైన ఆస్తి పరాధీనం పాలైతే ఏం చేస్తున్నారు? ధర్మకర్తలుగా ధర్మానికి కట్టుబడి సంప్రదాయాల్ని కొనసాగించాలి. ఆయన ధర్మకర్తనా? అధర్మకర్తనా? మాన్సాస్ ట్రస్ట్.. సింహాచలం దేవస్థానం ఆస్తుల దుర్వినియోగంపై బహిరంగ చర్చకు రాగలరా? ఎక్కడ డిబేట్ పెట్టినా రావటానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధమైతే రా'' అంటూ సవాలు విసిరారు.

చంద్రబాబు ప్రభుత్వంలో 840 ఎకరాల దేవస్థానం భూమి అన్యాక్రాంతం అవుతుంటే ధర్మకర్తలు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించిన విజయసాయి.. అశోక్ గజపతి రాజుపై పలు సందేహాల్ని వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్టులో అక్రమాలకు అశోక్ గజపతినే బాధ్యుడిగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబు ప్రభుత్వంలో సింహగిరిపై అనేక అక్రమాలు జరిగాయని.. త్వరలోనే పంచ గ్రామాల భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందన్నారు. తరచూ మాన్సాస్ ట్రస్టు వ్యవహారంపై అశోక్ గజపతిని విజయసాయి టార్గెట్ చేయటం మామూలే అయినా.. తాజాగా ఇంత భారీ ఆరోపణ సందించిన నేపథ్యంలో అశోక్ గజపతి ఏమని రియాక్టు అవుతారో చూడాలి.
Tags:    

Similar News