ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలోని సంసద్ వద్ద ధర్నా చేపట్టిన వైఎస్ ఆర్ సీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి - విజయసాయిరెడ్డి - వైవీ సుబ్బారెడ్డి - వరప్రసాద్ - ధర్మాన ప్రసాదరావు - బొత్స సత్యనారాయణ - ఎంపీ మిథున్ రెడ్డి - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలను అరెస్టు చేశారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసులతో అరెస్టులకు పాల్పడుతుందని, ఇందులోచంద్రబాబు పాత్ర ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజీనామాలకు - అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉన్నామని ఎంపీ వరప్రసాద్ అన్నారు. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడే నిరసన తెలుపుతామని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాన్ని అణచివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆంధ్రులకు ప్రత్యేక హోదా హక్కు అని గతంలో పార్లమెంట్ లో నిర్ణయం తీసుకున్నారన్నారు. నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని పోలీసుల చేత అణచివేయాలని చూస్తున్నారని, దీంట్లో చంద్రబాబు పాత్ర కూడా ఉందన్నారు. అరెస్టు అయినా పర్వాలేదు హోదా సాధించే వరకు పోరాడుతామన్నారు. జనసేన అధినేత పవన్ - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. జనసేన ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ పేరుతో చేస్తున్న హడావుడి అంతా నాటకమని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. దీని వెనుక ఉంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఆరోపించారు.
జేఎఫ్ సీ పేరుతో జరుగుతున్నదంతా డ్రామా అని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. జేఎఫ్ సీలో సభ్యులైన ఉండవల్లి అరుణ్ కుమార్ సహా మిగతా వారు అంతా పెయిడ్ ఆర్టిస్టులను మండిపడ్డారు. జేఎఫ్ సీ నివేదికలతో రాష్ర్టానికి ఒరిగేదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేకహోదా కేవలం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ ఎంపీలకు రాష్ట్రంపై ప్రేమ ఉంటే వాళ్లు పదవి నుంచి వైదొలగాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.