వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ అనుబంధసంఘాలకు విజయసాయిని ఇన్చార్జిగా నియమిస్తు జగన్ ఆదేశాలు జారీచేశారు. మొన్నటివరకు ఎంపీ ఉత్తరాంధ్రకు ఇన్చార్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇపుడు ఆ బాధ్యతలనుండి తప్పించారు. ఉత్తరాంధ్ర బాద్యతలనుండి ఎంపీని తప్పించారనగానే విజయసాయి ప్రాధాన్యత తగ్గిపోయిందనే ప్రచారం జరిగింది.
అయితే ఇపుడు అంతకన్నా పెద్ద బాద్యతనే ఎంపీకి జగన్ అప్పగించారు. మరో రెండున్నరేళ్ళల్లో షెడ్యూల్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల కోసం పార్టీ అనుబంధ సంఘాలైన వైసీపీ మహిళా విభాగం, రైతు విభాగం, యువజన విభాగం, సోషల్ మీడియా వింగ్, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు, ట్రేడ్ యూనియన్ ఇలా అనేక అనుబంధ విభాగాలున్నాయి. అధికారంలో ఉన్న కారణంగా ఈ అనుబంధ విభాగాల్లో సోషల్ మీడియా విభాగం ఒక్కటే బాగా యాక్టివ్ గా ఉంది.
తొందరలోనే ఎన్నికలు జరగబోతున్న కారణంగా మిగిలిన అనుబంధ సంఘాలను కూడా యాక్టివ్ చేయాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే అనుబంధ సంఘాల పర్యవేక్షణ బాధ్యతంతా విజయసాయిపైన మోపారు. పార్టీ ఎంపీలందరిలోకి విజయసాయి బాగా యాక్టివ్ గా ఉంటారని అందరికీ తెలిసిందే. ఢిల్లీ వ్యవహారాలను చక్కపెట్టడంతో పాటు ఉత్తరాంధ్ర మొత్తంలో టూర్ చేస్తునే ఉండేవారు. ప్రజలను, నేతలను, కార్యకర్తలను కలుస్తుండేవారు.
విజయసాయి సేవలను ఒక్క ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితం చేయకుండా అనుబంధ సంఘాల ఇన్చార్జిని చేయటంతో యావత్ రాష్ట్రం ఆయన కనుసన్నల్లోకి వచ్చేసింది. ఇక నుండి రెగ్యులర్ గా అనుబంధ సంఘాల బాధ్యులతో సమావేశాలు పెట్టుకోబోతున్నారు. జనాల్లోకి బాధ్యులు వెళ్ళటం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటమే ప్రధాన బాద్యతగా విజయసాయి అందరినీ ఉరుకులు పరుగలు పెట్టించబోతున్నారు. మరి జగన్ ఇచ్చిన టార్గెట్ ను విజయసాయి ఏ విధంగా సక్సెస్ చేస్తారో చూడాలి.