సంచార జాతులపై జాలి చూపండి..విజయసాయి విన్నపం

Update: 2019-12-04 16:20 GMT
సంచార, విముక్త జాతులను ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం పరిధిలోకి తీసుకురావాలని బుధవారం రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ సమసమాజ స్థాపన లక్ష్యంగా అణగారిన వర్గాల ప్రజలు దౌర్జన్యాలు, దుర్మార్గాల పాలిట పడకుండా మన రాజ్యాంగ నిర్మాతలు రక్షణ కల్పించారు.

దానికి అనుగుణంగానే ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం వచ్చింది. సమాజంలో అణచివేతకు, నిరాదరణకు గురయ్యే వర్గాల ప్రజలను అత్యాచారాలు, దౌర్జన్యాల నుంచి కాపాడటం ఈ చట్టం ఉద్దేశం. ఎస్సీ, ఎస్టీలను మాత్రమే ఈ చట్టం పరిధిలోకి తీసుకవచ్చి మిగిలిన సంచార, విముక్త జాతులను విస్మరించడం దురదృష్టకరం అని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.

సమాజంలో ఈనాటికీ సంచార ఇతర విముక్త జాతుల ప్రజలు దయనీయమైన జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు తరచుగా దోపిడీకి దౌర్జన్యాలకు గురవుతున్నారు. అత్యాచార నిరోధకం చట్టం ఛత్రం కింద ఉన్న ఎస్సీ, ఎస్టీల కంటే వారి పరిస్థితి దారుణంగా ఉందని ఆయన చెప్పారు.

ఈ జాతులకు చెందిన ప్రజలను దోపిడీ, దౌర్జన్యాల నుంచి కాపాడటానికి  ఇప్పుడు దృఢ నిశ్చయంతో చర్యలు చేపట్టాలి. అప్పుడే వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించగలుగుతారని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సంచార, విముక్త జాతులన్నింటినీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం పరిధిలోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Tags:    

Similar News