విజయసాయిరెడ్డిపై 19 కేసులు.. ఆయన భార్య వద్ద రూ.కోట్లు విలువ చేసే వజ్రాలు!

Update: 2022-05-26 10:30 GMT
వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల ఇన్చార్జిగా, వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులకు కోఆర్డినేటర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ఆ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నారు.. వేణుంబాక విజయసాయిరెడ్డి. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం ఈ ఏడాది జూన్ నాటికి ముగియనుంది. దీంతో మరోసారి వైఎస్సార్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ఆయనను రెండోసారి రాజ్యసభకు తమ పార్టీ తరఫున సీటు ఇచ్చారు.

వాస్తవానికి రెండోసారి విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపరని.. ఆయన సేవలను రాష్ట్రంలోనే వాడుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అలాగే వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటరీ స్థానంలో లోక్ సభకు విజయసాయిరెడ్డి పోటీ చేస్తారని అన్నారు.

అందులోనూ ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించడం కూడా ఇందుకు ఊతమిచ్చింది. అయితే.. విజయసాయిరెడ్డికి ఢిల్లీలో ఉన్న విస్తృత పరిచయాలు, అన్ని పార్టీల నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆయనను రెండోసారి కూడా జగన్ రాజ్యసభకు ఎంపిక చేశారు.

తాజాగా రాజ్యసభకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు బీద రవిచంద్ర యాదవ్, ఆర్.కృష్ణయ్య, విజయసాయిరెడ్డి, ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. రెండోసారి రాజ్యసభకు ఎంపికవుతున్న విజయసాయిరెడ్డి ఆస్తుల విలువ రూ.21.57 కోట్లు అని ఆయన నామినేషన్ లో పేర్కొన్నారు. అలాగే ఆయన భార్య సునందారెడ్డి వద్ద 1456 గ్రాముల బంగారంతోపాటు రూ.2.90 కోట్ల విలువ చేసే వజ్రాలు కూడా ఉన్నాయి. అలాగే తనకు రూ.24.65 లక్షల అప్పులున్నాయని విజయసాయిరెడ్డి నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు.

ఆస్తులు-అప్పులతోపాటు విజయసాయిరెడ్డి తనపై ఉన్న కేసుల వివరాలను కూడా నామినేషన్ లో పేర్కొన్నారు. మొత్తం తనపై 19 కేసులు నమోదై ఉన్నాయని వివరించారు. ముఖ్యమంత్రి జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ 8 కేసులు పెట్టింది. అలాగే సీబీఐ కేసులు 11 ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులు విచారణలో ఉన్నాయని తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంతోపాటు అవినీతి నిరోధక చట్టం, మోసం, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద విజయసాయిరెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News