ఏపీలో 409 మంది రైతుల ఆత్మ‌హ‌త్య‌

Update: 2018-12-28 17:03 GMT
త‌మ‌ది రైతు సంక్షేమ ప్ర‌భుత్వ‌మ‌ని ప్ర‌చారం చేసుకుంటున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌లో అన్న‌దాత‌లు అసువులు బాస్తున్న తీరు తాజాగా మ‌రోమారు అధికారరిగా రుజువు అయింది. ఏపీలో గడిచిన 4 ఏళ్ళలో 409 మంది రైతులు ఆత్మహత్యలు  చేసుకున్నట్లు కేంద్ర తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ - రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి పురోషోత్త‌మ్‌ రూపాల సమాధానం చెప్పారు.

పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా వైసీపీ ఎంపీ  విజయసాయిరెడ్డి ``గడచిన నాలుగేళ్ళ కాలంలో రాష్ట్రంలో 2 వేల మందికి పైగా రైతులు బలవన్మరణానికి పాల్పడిన విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? రైతు రుణమాఫీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం  వైఫల్యంతో పాటు రుణాల ఊబిలో కూరుకుపోవడమే రైతు ఆత్మహత్యలకు కారణాలన్న విషయం వాస్తవమేనా?``అని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి - ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీలో జిల్లా స్థాయిలో ఏర్పాటైన త్రిసభ్య సంఘం ఇచ్చిన నివేదికల ఆధారంగా 409 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మంత్రి తెలిపారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర  రాకపోవటం - కౌలు రైతుల కష్టాలు - బ్యాంకు రుణాలు అందకపోవటం - ప్రైవేటు వడ్డీవ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకోవటం - పెరిగిన ఖర్చులు - వర్షాభావం - ప్రకృతి వైపరీత్యాలు - అనారోగ్యం వంటి అంశాలే రైతుల ఆత్మహత్యకు ప్రధాన కారణాలని ప్రభుత్వం వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన త్రిసభ్య సంఘాలు గ్రామాల్లో  పర్యటించి నివేదిక ఇచ్చాయి.వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని - వ్యవసాయ రంగం అభివృద్ధి ఆయా రాష్ట్రాల ప్రాధమిక బాధ్యత అని మంత్రి చెపుతూ..తగిన విధానపరమైన చర్యలు - బడ్జెట్ మద్దతు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు అమలు చేసే కార్యక్రమాలకు తోడ్పాటును అందిస్తుందని తెలిపారు.
Tags:    

Similar News