జ‌గ‌న్ అప్‌ డేటెడ్ పాలిటిక్స్ చూశారా?

Update: 2017-07-20 07:55 GMT
అత్యంత పిన్న వ‌య‌సులోనే సొంతంగా ఓ రాజ‌కీయ పార్టీని స్థాపించ‌డ‌మే కాకుండా... దేశంలో ఒక‌రికో - ఇద్ద‌రికో సాధ్య‌మైనంత మెజారిటీతో ఎన్నిక‌ల్లో గెలిచి త‌న స‌త్తా ఏమిటో చూపిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దేశంలోని కొత్త త‌రం పొలిటీషియ‌న్ల‌కు నిజంగానే ఆద‌ర్శంగా నిలుస్తున్నార‌ని చెప్పాలి. త‌న తండ్రి చ‌నిపోయిన సంద‌ర్భంగా గుండెలోని దుఃఖాన్ని దిగ‌మింగుకుని మ‌హానేత మ‌ర‌ణంతో కుంగిపోతున్న జ‌నానికి భ‌రోసా క‌ల్పించ‌డంలో జ‌గ‌న్‌కు సాటి రాగ‌ల పొలిటీషియ‌న్ ప్ర‌స్తుత కాలంలో ఎవ‌రూ లేర‌నే చెప్పాలి. ఓ వైపు నాడు విప‌క్షంలో ఉన్న టీడీపీ వ‌రుస‌గా విమ‌ర్శ‌లు సంధిస్తున్నా... నాడు రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో అంట‌కాగి కోర్టులో కేసులు వేస్తున్నా... జ‌గ‌న్ కించిత్ కూడా భ‌య‌ప‌డ‌క‌పోగా... ఎదురొడ్డి నిలిచిన తీరు రాష్ట్ర రాజ‌కీయాల‌నే కాకుండా జాతీయ రాజ‌కీయాల్లో కూడా పెను సంచ‌ల‌నంగా మారిన వైనాన్ని తెలుగు ప్ర‌జ‌లు ఎన్న‌టికీ మ‌రువ‌రేమో. త‌న‌పై మోపిన అభియోగాలు నిర్ధార‌ణ కాకుండానే ద‌ర్యాప్తు అధికారుల అత్యుత్సాహంతో 16 నెల‌ల పాటు జైలు జీవితం గ‌డిపి బెయిల్ పై విడుద‌లైన సంద‌ర్భంగా జ‌గ‌న్‌ కు జైలు నుంచి త‌న ఇంటికి దాకా అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన వైనాన్ని నాడు ప్రాంతీయ ఛానెళ్ల‌తో పాటు జాతీయ మీడియాలోనూ లైవ్ కొన‌సాగిన తీరు ఇందుకు నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చేమో.

పార్టీ ఫిరాయింపుల‌పై స్ప‌ష్ట‌మైన వ‌వైఖ‌రితో ఉన్న జ‌గ‌న్‌.. నాడు కాంగ్రెస్ పార్టీ టికెట్‌ పై గెలిచిన తాను, త‌ల్లితో పాటు ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌డ‌మే కాకుండా... కాంగ్రెస్‌ ను వీడి త‌న పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలు - ఎంపీల‌తో రాజీనామాలు చేయించి అఖండ మెజారిటీతో విజ‌యం సాధించ‌డం ఒక్క జ‌గ‌న్‌ కు మాత్ర‌మే సాధ్య‌మైంద‌ని చెప్పాలి. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... రాష్ట్ర రాజ‌కీయాల‌తో పాటు జాతీయ రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న ప‌లు కీల‌క ప‌రిణామాల‌పై జ‌గ‌న్ అండ్ కోకు ఎంత‌గా అవ‌గాహన ఉందో చెప్పే సంద‌ర్భంగానే ఈ విష‌యాల‌ను ప్ర‌స్తావించాల్సి వ‌చ్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌ను డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం ప‌ట్టి పీడిస్తోంది. హైద‌రాబాదులో ఎక్సైజ్ శాఖ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డ డ్ర‌గ్స్ వ్యాపారి కెల్విన్ నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ పెను క‌ల‌క‌ల‌మే రేపింది. ఒక్క సెల్ ఫోన్ లోని స‌మాచారంతోనే టాలీవుడ్‌ కు చెందిన ప్ర‌ముఖులు ఇప్పుడు సిట్ కార్యాల‌యం ముందు విచార‌ణ‌కు క్యూ క‌ట్టాల్సిన దుస్థితి.

ఈ త‌రుణంలో అస‌లు ఈ వ్య‌వ‌హారం ఏ మేర రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసింద‌న్న అంశంపై రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు టీఆర్ ఎస్ - టీడీపీలతో పాటు తెలంగాణ‌లోని ఏ ఒక్క రాజ‌కీయ పార్టీ కూడా ప‌ట్టించుకోకున్నా... బాధ్య‌త క‌లిగిన విప‌క్ష హోదాలో ఉన్న వైసీపీ ఈ అంశాన్ని నిన్న పార్ల‌మెంటు వేదిక‌గా ప్ర‌స్తావించింది. పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభ‌మైన తొలిరోజే రాజ్య‌స‌భ‌లో వైసీపీ ఎంపీ వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డి ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. కేవ‌లం ప్ర‌స్తావ‌న‌తోనే స‌రిపెట్టని ఆయ‌న... డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్రం అండ‌గా నిల‌వాల్సి ఉంద‌ని కూడా ఆయ‌న ఎన్డీఏ స‌ర్కారుపై ఉన్న గురుత‌ర బాధ్య‌త‌ను మోదీ ప్ర‌భుత్వానికి తేట‌తెల్లం చేశారు.

తెలుగు నేల‌లో బ‌ర్నింగ్ ఇష్యూగా మారిన డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై ఏ ఒక్క రాజ‌కీయ పార్టీ ప్ర‌స్తావించే సాహ‌స‌మే చేయ‌క‌పోగా... విప‌క్షంలో ఉన్న వైసీపీ ధైర్యంగా ఈ అంశాన్ని ప్ర‌స్తావించింది. రాజ్య‌స‌భ‌లో దీనిపై మాట్లాడిన సాయిరెడ్డి... ప‌లు జాతీయ పార్టీల మ‌న్న‌న‌ల‌ను కూడా అందుకున్నారు. వ‌ర్ధ‌మాన రాజ‌కీయాల‌పై ఈ మాత్రం అప్ డేట్ ప్ర‌ద‌ర్శిస్తున్న రాజ‌కీయ పార్టీలు దాదాపుగా లేవ‌నే చెప్పాలి. అలాంటిది రాజ్య‌స‌భ‌లో సింగిల్ సీటు ఉన్న వైసీపీ ఈ అంశాన్ని ప్ర‌స్తావించిందంటే... జ‌గ‌న్ ఏ మేర అప్ డేటెడ్ పాలిటిక్స్ చేస్తున్నారో ఇట్టే అర్ధం కాక మాన‌దు.
Tags:    

Similar News