బాబు వ‌ల్లే ఏపీకి న‌ష్టం..ఆయ‌న‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌ను

Update: 2018-03-30 06:42 GMT
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఆయనకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి పున‌రుద్ఘాటించారు. ఏపీకి చంద్ర‌బాబు వ‌ల్లే తీర‌ని ద్రోహం జ‌రిగింద‌ని, ఆయ‌న స్వ‌లాభాల‌కు రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టుపెట్టార‌ని ఆరోపించారు. చంద్రబాబుకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఎంతమాత్రం లేదని విజయ‌ సాయిరెడ్డి అన్నారు. గ‌తంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌ను టీడీపీ నాయ‌కులు తీవ్ర‌మైన ప‌రుష‌ప‌ద‌జాలంతో దూషించిన‌ప్పుడు ఇవే సంస్కృతి - సంప్ర‌దాయాలు ఎందుకు గుర్తుకురాలేద‌ని విజ‌య‌సాయిరెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు.
 
రాష్ట్రానికి హోదా అవసరం లేదు.. ప్యాకేజీ ఇస్తే చాలంటూ వాదించిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మాటమార్చి హోదాకోసం పోరాట‌మని అంటున్నాడని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. నాలుగేళ్లపాటు హోదాను మరిచి నిద్రపోయిన చంద్రబాబు.. ఇప్పుడు నిద్రలేచి ‘హోదా.. హోదా’ అంటున్నాడని విమర్శించారు. ఇదే గ‌ళం ముందు నుంచి వినిపిస్తే ఏపీకి హోదా విష‌యంలో కేంద్రం నిర్ణ‌యం మ‌రో ర‌కంగా ఉండేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. అఖిల పక్షం పేరుతో చంద్రబాబు హోదా ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రజలను మోసం చేయవద్దని ఆయన చంద్రబాబుకు హితవు చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని విజ‌య‌సాయిరెడ్డి పున‌రుద్ఘాటించారు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాల కోసం మొద‌ట‌గా గ‌ళం విప్పింది, నాలుగేళ్లుగా పోరాటం చేస్తోంది వైసీపీ మాత్ర‌మేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వైసీపీ రాజీలేని పోరాటం వ‌ల్లే మిగ‌తా పార్టీలు సైతం స్పందిస్తున్నాయ‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు త‌న మైండ్ సెట్ మార్చుకొని చిత్త‌శుద్ధితో పోరాటం చేయాల‌ని కోరారు.
Tags:    

Similar News