రాముల‌మ్మ కండీష‌న్ల‌కు ఓకే అయితేనే సీన్లోకి వ‌స్తారా?

Update: 2018-08-26 05:37 GMT
సినిమాల్లో లేడీ అమితాబ్ ఇమేజ్ ను సొంతం చేసుకొని.. త‌ర్వాత సొంత పార్టీ పెట్టుకొని.. దాన్ని మూసేసి ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా పార్టీలు మారిన ఘ‌న చ‌రిత్ర విజ‌యశాంతి సొంతం. ఇప్ప‌టికైతే ఆమె కాంగ్రెస్ లో కొన‌సాగుతున్న‌ట్లు చెబుతున్నారు. గ‌డిచిన కొన్ని నెల‌లుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న‌ట్లు చెబుతున్నా.. యాక్టివ్ గా ఒక్క కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ది లేదు. అంత‌దాకా ఎందుకు.. మొన్న‌టికి మొన్న హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత‌లంతా పోలోమ‌ని వ‌స్తే.. విజ‌య‌శాంతి మాత్రం క‌నిపించ‌లేదు.

అలాంటి విజ‌య‌శాంతి తాజాగా ఒక ప్ర‌క‌ట‌న చేస్తూ.. టీడీపీ.. కాంగ్రెస్ పొత్తు దుర్మార్గ‌మంటూ మండిప‌డ్డారు. పార్టీలో యాక్టివ్ గా లేకున్నా.. ముంద‌స్తు ఎన్నిక‌లు దూసుకొస్తున్న వేళ రాముల‌మ్మ ఏం చేయ‌నున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఒక‌ప్పుడు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తోబుట్టువులా పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఆమె.. త‌ర్వాతి కాలంలో కేసీఆర్ తో దూరం కావ‌ట‌మే కాదు.. టీఆర్ ఎస్ అంటేనే మండిప‌డే ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో రాముల‌మ్మ ఏం చేయ‌నున్నార‌న్న విష‌యంపై ఆమె స‌న్నిహితులు చెబుతున్న స‌మాచారం చూస్తుంటే.. ఈసారి ఎన్నిక‌ల్లో ఆమె పోటీ చేయ‌ర‌ని చెబుతున్నారు. అలా అని ఖాళీగా కూడా ఉండ‌ద‌న్న మాటను చెబుతున్నారు. త‌న‌కున్న చ‌రిష్మాతో పార్టీకి ప్ర‌యోజ‌నం క‌లిగేలా చేయ‌ట‌మే కాదు.. టీఆర్ ఎస్ వైఫ‌ల్యాల్ని ఎండ‌గట్టేందుకు ఆమె సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు చెబుతున్నారు. ఇందుకు కాను.. త‌న‌కు రాజ్య‌స‌భ అవ‌కాశం ఇస్తామ‌న్న హామీని పార్టీ అధినాయ‌క‌త్వం ఇవ్వాల‌న్న మాట‌ను చెబుతున్నారు.

మ‌రోవైపు మాత్రం.. అందుకు భిన్న‌మైన వాద‌న‌ను వినిపిస్తోంది. ప్ర‌స్తుతం పార్టీలో ఎలాంటి ప‌ద‌వి లేని రాముల‌మ్మకు తొలుత పార్టీలో గౌర‌వ‌మైన ప‌ద‌విని ఇవ్వాల‌ని.. ఆ త‌ర్వాతే ఆమె ప్ర‌చార గోదాలోకి దిగుతార‌న్న మాట వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేందుకు సైతం ఆమె ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని చెబుతుఉన్నారు. పార్టీ అధినాయ‌క‌త్వం ఆదేశాల‌కు త‌గ్గ‌ట్లుగా పోటీ బ‌రిలో ఉంటార‌న్న వాద‌న వినిపిస్తోంది. రెండు భిన్న‌మైన వాద‌న‌ల న‌డుమ రాముల‌మ్మ త‌నకు తానుగా త‌న‌ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తేనే ఈ ఇష్యూపై క్లారిటీ వ‌స్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.



Tags:    

Similar News