కమ్మ సామాజిక సమ్మేళనానికి విజయసాయి.. అక్కడేం చెప్పారు?

Update: 2021-03-09 05:30 GMT
కొందరు నేతలకు కొన్ని ఇమేజ్ లు ఉంటాయి. వాటి చట్రంలోని రావటానికి వారు చేసే కొన్ని ప్రయత్నాలు ఆసక్తికరంగా మారతాయి. తాజాగా అలాంటి ప్రయత్నమే చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. తమ రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబును విమర్శించాలన్నా.. తప్పు పట్టాలన్నా.. ఆయన మద్దతుదారులపై విమర్శల బురద జల్లాలన్నా.. ‘కమ్మ’ అస్త్రాన్ని తరచూ తీసే విజయసాయి.. తాజాగా విశాఖలో జరిగిన కమ్మ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి.

సోషల్ మీడియాలో తన ట్వీట్లలలో తరచూ ‘కమ్మ’ ప్రస్తావన తెచ్చే విజయసాయి.. తన రోటీన్ తీరుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ ఒక్క వర్గానికి.. కులానికి వ్యతిరేకం కాదని.. కులాల విషయంలో తమకు పెద్దగా పట్టింపులు ఉండవన్నారు. అందరిని సమానంగా చూస్తామన్నారు. తాజాగా జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో కులాలు.. మతాలకు అతీతంగా తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.

విశాఖలో జరుగుతున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యమని తేల్చిన ాయన.. కమ్మ సామాజిక నేతలకు ఎలాంటి సహకారం అవసరమైనా.. అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు వ్యాపార రంగంలో ముందు వరసలో ఉంటారని.. వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు.

అంతేకాదు.. తనకుకులాల పట్టింపులు పెద్దగా ఉండవని.. అందరిని సమానంగా చూస్తానని చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఏ మాత్రం అవకాశం ఉన్నా కమ్మ పేరుతో బాబునుతరచూ విమర్శలు సంధించే విజయసాయి.. అందుకు భిన్నంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి.. విశాఖ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
Tags:    

Similar News