విజ‌య సాయి రెడ్డిని ఈ మాట‌తో బాగా ట్రోల్‌

Update: 2022-03-06 09:31 GMT
ఏపీ అధికార పార్టీ వైసీపీలో సీఎం జ‌గ‌న్ త‌ర్వాత రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య సాయిరెడ్డి అత్యంత కీల‌క‌మైన నేత అనడంలో సందేహం లేదు. పార్టీ వ్య‌వ‌హారాలు, పాల‌న విష‌యాల్లో జ‌గ‌న్‌కు ఆయ‌న అండ‌దండ‌గా ఉంటున్నార‌ని తెలిసింది. పార్టీలో ఇంత‌టి కీల‌క వ్య‌క్తిపై ఇప్పుడు కార్య‌క‌ర్త‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

త‌మ‌ను ప‌ట్టించుకునే వాళ్లే లేర‌ని బ‌హిరంగంగా అస‌హ‌నం బ‌య‌ట పెడుతున్నారు. మాట‌లు చెప్ప‌డం చాలింటి ఇప్ప‌టికైనా త‌మ కోసం ఏదైనా చేయాల‌ని విజ‌య సాయిరెడ్డిని ట్రోల్ చేస్తున్నారు.

వైసీపీకి కార్య‌క‌ర్త‌లే పునాది అని త‌రుచూగా సాయిరెడ్డి చెప్పే వ్యాఖ్య‌ల‌తోనే ఇప్పుడు ఆయ‌న్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మాట ప‌దేళ్లుగా చెప్తూనే ఉన్నారు స‌ర్ కానీ అవి విని గంతులేసే రోజులు పోయాయ‌ని కార్య‌క‌ర్త‌లు తెగించి చెప్పేస్తున్నారు.

వైసీపీ కోసం ఆర్థికంగా స‌హా అన్ని ర‌కాలుగా ప‌ని చేసిన కార్య‌క‌ర్త‌లు ఇప్పుడు క‌నీసం ఊరు దాటి వెళ్లే ప‌రిస్థితి లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. తెలుగు దేశం నుంచి వ‌చ్చిన నేత‌లు ఇప్పుడు ఊర్లో రాజ‌కీయం న‌డిపుతున్నార‌ని చెబుతున్నారు. క‌ష్ట‌ప‌డిని కార్య‌క‌ర్త‌ల‌ను గుర్తించ‌డం లేద‌ని, ఆర్థికంగా  ఆదుకోలేక‌పోయినా క‌నీసం గౌర‌వం కూడా ఇవ్వ‌డం లేద‌ని బాధ ప‌డుతున్నారు.

2020లో సోష‌ల్ మీడియా స‌మావేశం పెట్టి కార్య‌క‌ర్త‌ల‌కు అది చేస్తాం ఇది చేస్తామ‌ని గొప్ప‌గా చెప్పార‌ని కానీ ఏం చేయ‌లేద‌ని కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఇప్ప‌టికీ త‌మ గురించి ఆలోచించ‌డం లేద‌ని చెబుతున్నారు. ఆ మీటింగ్ ఏదో వాళ్ల స్వ‌లాభం కోసం పెట్టుకున్నార‌ని మండిప‌డుతున్నారు.

ప‌ల్లెల్లో జ‌నాలు ఘోరంగా తిడుతున్నార‌ని పార్టీ కోసం ఇంత చేసి చివ‌ర‌కు తిట్లు ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీ మీద విజ‌య సాయిరెడ్డికి ఉన్న గౌర‌వం ఎంతో ఆయ‌న మీద మాకు కూడా అంతే గౌర‌వం ఉంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికైనా వాస్త‌వ స్థితిగ‌తులు తెలుసుకొని కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవాల‌ని కోరుతున్నారు.

పైన పేర్కొన్న కార్య‌క‌ర్త‌ల ఆవేద‌న ప్ర‌స్తుత ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంది. పార్టీ అధికారంలోకి రావ‌డం కోసం వాళ్లు అన్ని ర‌కాలుగా క‌ష్ట‌ప‌డ్డారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ గెల‌వ‌డంతో ఇక త‌మ శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం వ‌స్తుంద‌ని ఆశించారు.

కానీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ పార్టీని కానీ కార్య‌క‌ర్త‌ల‌ను కానీ ప‌ట్టించుకున్న దాఖ‌లాలే లేవ‌నే అభిప్రాయాలున్నాయి. ఎంత‌సేపు సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచ‌డం త‌ప్పించి ఆయ‌న ఏం చేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి.

నేరుగా ఖాతాల్లో డ‌బ్బులు వేయ‌డం.. స‌చివాల‌యాలు,వాలంటీర్ల వ్య‌వ‌స్థ ఏర్పాటు చేయ‌డంతో త‌మను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కిందిస్థాయి నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. ఇక పార్టీ కూడా ప‌ట్టించుకోక పోతే ఎలా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News