జగన్ పాదయాత్ర: విజయ సంకల్ప స్థూపం ప్రత్యేకతలివీ..

Update: 2019-01-09 09:13 GMT
దేశంలోని సుదీర్ఘ రాజకీయ పాదయాత్రల్లో ఒకటైన వైసీపీ అధినేత జగన్మోహన రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఈరోజు ముగుస్తున్న సందర్భంగా ముగింపు ప్రదేశం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద నిర్మించిన విజయసంకల్ప స్థూపం వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

ఇచ్ఛాపురం పట్టణం బైపాస్‌ రోడ్డు వద్ద బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన ఈ స్థూపాన్ని 91 అడుగల ఎత్తున నిర్మించారు. ఒడిశా రాష్ట్రంలోని ప్రవేశించడానికి కొద్ది కిలోమీటర్ల ముందు...శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ పైలాన్‌ అందరి దష్టినీ ఆకర్షిస్తోంది. 16వ నంబరు జాతీయ రహదారి పక్కనే నిర్మించిన దీనికి మరోవైపు హౌరా–చెన్నై రైల్వే లైను ఉంది. దీంతో అటు బస్సుల్లో , ఇటు రైళ్లలో ప్రయాణించే వారికి స్థూపం కనువిందు చేయనుంది.

ప్యారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ని పోలి ఉన్న ఈ స్థూపం నాలుగు ఉక్కు స్తంభాలతో బలంగా ఉంది. స్థూపం పై భాగాన పార్లమెంటు తరహాలో వృత్తాకారంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండా రంగులతో కూడిన ఒక ఆకృతి ఏర్పాటు చేశారు. దానిపైన పది అడుగుల ఎత్తులో పార్టీ పతాకం రెపరెపలాడుతుంది.

దాని దిగువున నాలుగు వైపులా దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఫోటోలను ఏర్పాటు చేశారు. ఆ దిగువన పాదయాత్రికుడు వైఎస్‌ జగన్‌ నడిచి వస్తున్న నిలువెత్తు చిత్రాలను ఉంచారు. పైలాన్‌ లోపలి భాగంలో చుట్టూ జగన్‌ తన పాదయాత్రలో ప్రజలను కలుసుకుంటూ వచ్చిన ఫొటోలను ఏర్పాటు చేశారు.

స్థూపం బేస్‌మెంట్‌ పైకి ఎక్కేందుకు 13 మెట్లను ఏర్పాటు చేశారు. ఈ పదమూడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ప్రతీక. వైయ‌స్ఆర్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దాకా జగన్‌ నడిచిన రూట్‌ మ్యాపును కూడా ఏర్పాటు చేశారు. స్థూపం చుట్టూ లాన్ ఉంది. అందులో శిలాఫలకం ఉంది.బయట చుట్టూ ప్రహరీ గోడపై ఓ వైపు ప్రజాసంకల్ప పాదయాత్ర 2017–2019 అని, మరోవైపు విజయసంకల్ప స్థూపం అని రాశారు.


Full View
Tags:    

Similar News