అసద్ ను మాటలతో ఉతికేసిన రాములమ్మ

Update: 2021-12-29 14:30 GMT
మరో రెండు నెలల్లో మొదలయ్యే యూపీ అసెంబ్లీ ఎన్నికల సందడి.. దేశ రాజకీయాల్లో వేడెక్కేలా చేస్తోంది. మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఈ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. అందరి చూపు యూపీ.. పంజాబ్ మీదనే ఉంది. యూపీ ప్రజలు ఇచ్చే తీర్పు దేశ రాజకీయాల్ని ప్రభావితం చేస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో యూపీలో అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.

ఇందులో భాగంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలంటే.. యూపీలో మరోసారి యోగి ప్రభుత్వం కొలువు తీరాలన్నట్లుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపుపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించటం తెలిసిందే.

అయోధ్య ఆలయాన్ని ప్రస్తావించి అమిత్ షా ఓట్లు అడగటమా? అంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన వేళ.. ఆయన వ్యాఖ్యలపై తాజాగా టీబీజేపీ ఫైర్ బ్రాండ్ రాములమ్మ రియాక్టు అయ్యారు. ఓవైసీ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పు పట్టిన ఆమె.. అసద్ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్ సభ స్థానం గురించి.. అక్కడి డెవలప్ మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ గురించి మాట్లాడటానికి ముందు.. హైదరాబాద్ పాతబస్తీలోని పరిస్థితుల గురించి మాట్లాడాలంటూ రాములమ్మ సవాలు విసిరారు.

అసద్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్న ఆమె.. ఆ విషయం పసిపిల్లలకు కూడా అర్థమవుతుందని మండిపడ్డారు. అసద్ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలోని పాతబస్తీ వైపు ఒకసారి చూస్తే.. అసద్ కు విషయం అర్థమవుతుందన్నారు.

తన నియోజకవర్గంలో కనీస వసతులపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా.. నిజాం కాలపు పాత గల్లీల్లో జనం పేదరికం మధ్య నలిగిపోతుంటే.. ఓవైసీ యూపీకి వెళ్లి నీతులు చెబుతున్నారన్నారు. ఓవైసీపై ఘాటు విమర్శలు చేసిన విజయశాంతి పోస్టులో ఏముందంటే..

- ‘శతాబ్దాల కాలంగా సాగిన హిందువుల పోరాటాలు, త్యాగాల ఫలంగా నేడు అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మితమవుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఒకవైపు ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతునే శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో మనోహరమైన రామమందిరం రూపుదిద్దుకుంటోంది.

మన భారతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలైన రాష్ట్రాలలో యూపీ ఒకటి. అయోధ్యలో హిందువులకు ఆరాధ్య దైవమైన రామ మందిర నిర్మాణం, మన రామాయణ సంస్కృతి వారసత్వం ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగాలంటే ఇతర పార్టీలకు బదులు యూపీలో మళ్లీ బీజేపీనే ఎన్నుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇచ్చిన పిలుపుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన తీరు అభ్యంతరకరం’

- ‘యూపీలో బీజేపీ అభివృద్ధికి బదులు ఆలయాన్ని చూపించి ఓట్లడుగుతోందనే అర్థం వచ్చేలా ఓవైసీ మత కోణాన్ని చొప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే సీఎం యోగి ఆదిత్యనాథ్ హయాంలో యూపీలో అభివృద్ధికి ఢోకా లేదని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి.

అంతేగాక, సమాజ్‌వాదీ లాంటి పార్టీ అధికారంలోకి వస్తే, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆలయ నిర్మాణం జరగకుండా చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, అభివృద్ధి గురించి అసదుద్దీన్ గారు మాట్లాడటమే విడ్డూరంగా ఉంది’

- ‘ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని పాతబస్తీ వైపు ఒకసారి చూస్తే... అసదుద్దీన్ గారి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్న విషయం పసిపిల్లలకు కూడా అర్థమవుతుంది. తన నియోజకవర్గంలో కనీస వసతులపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా... నిజాం కాలపు పాత గల్లీల్లో జనం పేదరికం మధ్య నలిగిపోతుంటే యూపీ వెళ్లి నీతులు చెబుతున్నారు.

ప్రజల్లో సామరస్యాన్ని చెడగొట్టి, రెచ్చగొట్టేలా మాట్లాడే ఓవైసీ సోదరుల తీరు... గతంలోని పలు సందర్భాల్లో వారు చేసిన మత విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రజలకు కొత్త కాదు. ఓవైసీ బ్రదర్స్ నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఇక్కడెవరికీ లేదని వారు గ్రహించాలి. ఓవైసీ మాటలను వారి సయామీ ట్విన్స్ టీఆరెస్ తప్ప దేశ ప్రజలెవరూ విశ్వసించరు’
Tags:    

Similar News