కెప్టెన్ నోట రజనీకి మంటెక్కిపోయే మాట

Update: 2016-04-17 04:36 GMT
ఎలా అయినా సరే తమిళనాడుకు సీఎం కావాలన్నది సినీ నటుడు.. కెప్టెన్ గా సుపరిచితుడైన డీఎండీకే అధినేత విజయకాంత్ కోరిక. ఇందుకోసం ఆయన సొంతంగా పార్టీ పెట్టటమే కాదు.. ఏళ్ల తరబడి కిందా మీదా పడుతున్నారు. తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నాచితకా పార్టీలన్నింటికి ఒక కూటమిగా చేసి.. తానో రింగ్ మాస్టర్ అయ్యి.. సీఎం పీఠాన్ని చేజిక్కించుకోవాలని ఆయన తపిస్తున్నారు.

ఇలాంటి ఆశ ఉన్న నేత నోటి నుంచి ఏ మాట రాకూడదో ఆ మాట రావటం ఇప్పుడు తమిళనాడులో మంట పుట్టిస్తోంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు వీలైనంతవరకూ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి ఎవరూ ప్రస్తావించరు. తమ ఓటుబ్యాంకుకు నష్టం వాటిల్లుతుందన్నప్పుడు మాత్రమే నోరు విప్పుతారు. కానీ.. అలాంటిదేమీ లేకుండానే కదిలించి పెట్టించుకున్నట్లుగా కెప్టెన్ వ్యవహరించటం ఇప్పుడు సంచలనంగా మారింది.

రాజకీయాలకు ఆమడ దూరం ఉంటూ.. తన మానాన తాను బతికే సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విజయ్ కాంత్. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైలోని విల్లివాకంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రజనీకాంత్ కు భయమని.. అందుకే రాజకీయాల్లోకి రాలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎప్పటికప్పుడు తన రాజకీయ ప్రవేశం గురించి మాట దాటేస్తూ వస్తున్న రజనీకాంత్ కు నిజానికి భయం ఎక్కువని.. అందుకే ఆయన పాలిటిక్స్ లోకి రాలేదన్నారు.

తాను నటించిన గజేంద్ర సినిమాలో తమిళన్.. తమిళన్ అనే పాటన నిలిపివేయాలని చాలానే హడావుడి చేశారని.. తాను లెక్క చేయకుండా సినిమా విడుదల చేసినట్లుగా గొప్పలు చెప్పుకున్నారు. మంచి నాయకులకు మాత్రమే తాను భయపడతానని.. రజనీకాంత్ లా వెనక్కి తగ్గనన్న కెప్టెన్ మాటలు విన్న సూపర్ స్టార్ అభిమానులు మండిపడుతున్నారు. గొప్పలు చెప్పుకోవాలంటే ఒకరిని కించిపరచాలా? అంటూ మండిపడుతున్నారు. తన దారిన తానున్న రజనీకాంత్ కి మంట పుట్టేలా కెప్టెన్ మాటలున్నాయన్న విమర్శ వినిపిస్తోంది. అయినా.. ఎన్నికల వేళ వీలైనంతమందిని కూడగట్టుకోవాలే కానీ.. ఇలా మాట్లాడి లేని తగువులు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?
Tags:    

Similar News