విజయమ్మ ఆత్మీయ సమావేశానికి అన్ని ఆయనేనట

Update: 2021-09-01 12:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర.. ఆశ్చర్యకర రాజకీయ పరిణామాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు విజయమ్మ. కొద్ది నెలల క్రితం ఇలాంటి తీరునే ప్రదర్శించిన ఆమె కుమార్తె షర్మిల.. తెలంగాణలోపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ముందుగా క్రియేట్ అయిన హైప్ ను కంటిన్యూ చేయటంలో షర్మిల తడబాటుకు గురవుతున్నారన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. ప్రధాన పార్టీలకు షర్మిల షాకులు తప్పదన్నట్లుగా జరిగిన ప్రచారానికి భిన్నంగా.. రివర్సు గేరులో ఆమెకే షాకులు తగలటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పన్నెండో వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నాడు వైఎస్ మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న వారిని.. అత్యంత సన్నిహితులను ఆహ్వానిస్తూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న విజయమ్మ స్వయంగా ఆహ్వానాలు పంపినట్లుగా చెబుతున్నారు. ఇంతకీ ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారన్న దానిపై ఎలాంటి సందేహాలు లేనప్పటికీ.. దాన్ని కోఆర్డినేట్ చేయటం.. ఫాలో అప్ చేయటం లాంటివి ఎవరు చూస్తున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

దీనికి సమాధానం వెతికినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం పేషీలో అడిషనల్ పీఎస్ గా వ్యవహరించిన శర్మనే తాజాగా సీన్లోకి రావటం ఆసక్తికరంగా చెప్పాలి. సీఎం పేషీ చూసే జర్నలిస్టులతో పాటు.. అక్కడకు తరచూ వచ్చే వారికి ఆయన సుపరిచితుడు. గతంలో వైఎస్ కార్యక్రమాలకు ఆయనే కర్త.. కర్మ.. క్రియ అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. వైఎస్ పాల్గొనే ప్రతి కార్యక్రమం ఆయనే ఫైనల్ చేసే వారని పాత సంగతుల్ని గుర్తు చేసుకుంటూ చెబుతారు. పేరుకు కో ఆపరేటివ్ డిపార్ట్ మెంట్ లో పని చేసినా.. డిప్యుటేషన్ మీద తన వద్దకు తెచ్చుకున్న ఆయన.. వైఎస్ కు వీర విధేయుడిగా పేరుంది.

అన్నింటికి మించి క్రమశిక్షణ.. నమ్మకానికి మారుపేరుగా నిలుస్తారని చెబుతారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన వెన్నంటే ఉండే వారిలో శర్మ.. సూరీడు.. చారి.. ప్రభాకర్ రెడ్డి.. జన్నత్ హుస్సేన్.. కిరణ్ కుమార్ రెడ్డిలు ఉండేవారు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత కూడా ఆయన కుటుంబంతో కలిసి ఉన్న అతి కొద్దిమందిలో శర్మ ముఖ్యులుగా చెబుతారు. గతానికి భిన్నంగా వైఎస్ వర్థంతి నాడు నాడు వైఎస్ కేబినెట్ లో పని చేసిన వారు.. ఆయన రాజకీయ సన్నిహితులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాలని విజయమ్మ కోరుకోవటం.. శర్మను అందుకు కీలకంగా మార్చి.. ఆయన సమన్వయంతో ఈ సమావేశాన్నినిర్వహించాలని డిసైడ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు శర్మ తన పాత పరిచయాల్ని తిరగదోడుతున్నారని చెబుతున్నారు.

సమావేశానికి ఎవరెవరిని పిలవాలి? వారికి సంబంధించిన వివరాలు.. కాంటాక్టులు అన్ని కూడా శర్మనే సేకరించినట్లు చెబుతారు. అంతేకాదు.. కార్యక్రమానికి హాజరు కావాలని కోరుతూ ఎవరితో నేరుగా ఫోన్లో మాట్లాడాలి? ఎవరికి మెసేజ్ లు పంపాలి? ఇలాంటివన్నివిషయాలు శర్మనే దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా విజయమ్మ ఆత్మీయ సమావేశంలో శర్మ కీలకభూమిక పోషిస్తున్నారని చెప్పక తప్పదు.




Tags:    

Similar News