విజ‌య‌సాయి ట్వీట్ తో త‌మ్ముళ్ల‌కు వ‌ణుకెందుకు?

Update: 2018-09-04 05:23 GMT
ఏపీ విప‌క్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు.. రాజ్య‌స‌భ స‌భ్యుడైన విజ‌య‌సాయి రెడ్డి చేసిన ట్వీట్ ఒక‌టి తెలుగు త‌మ్ముళ్ల‌కు వ‌ణుకుగా మారింది. తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్ లో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. బాల‌కృష్ణ న‌టిస్తున్న ఎన్టీఆర్ చిత్రంలో చంద్ర‌బాబు వంచ‌న‌.. ఎలా వెన్నుపోటు పొడిచార‌న్న‌ది చూపిస్తారా?  లేదా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. ఈ ట్వీట్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ఎన్నిక‌లు ముంచుకొస్తున్న వేళ‌.. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ విధానాల‌తో విసిగిపోయిన ఏపీ ప్ర‌జ‌ల‌కు.. నాడు ఎన్టీఆర్ విష‌యంలో చంద్ర‌బాబు చేసిన దుర్మార్గం క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా గుర్తుకు  తెచ్చేలా ఉన్న విజ‌య‌సాయి ట్వీట్ త‌మ‌ను ఎంత‌గా దెబ్బ తీస్తుంద‌న్న భ‌యాందోళ‌న‌లో తెలుగు త‌మ్ముళ్లు ఉన్నారు.

ఎన్టీఆర్ సినిమాతో భారీ ప్ర‌యోజ‌నం పొందొచ్చ‌న్న భావ‌న‌లో ఉన్న తెలుగు త‌మ్ముళ్ల‌కు ఇప్పుడీ సినిమాను ఎందుకు షురూ చేశార‌న్న ప్ర‌శ్న‌ను కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడీ సినిమాతో ఎన్టీఆర్ జీవితం మీద చ‌ర్చ మొద‌ల‌వుతుంద‌ని.. అదే జ‌రిగితే.. చంద్ర‌బాబు వెన్నుపోటు వ్య‌వ‌హారం తెర మీద‌కువ‌స్తుంద‌ని.. ఇది పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయ‌టం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇప్ప‌టికే దారుణ‌మైన అవినీతితో బాబు స‌ర్కారుపై ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇలాంటి వేళ‌.. ఎన్టీఆర్ వెన్నుపోటు విష‌యం సీరియ‌స్ టాపిక్ అయితే తెలుగు త‌మ్ముళ్ల‌కు మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే..ఘోర వైఫ‌ల్యాల‌తో  టీడీపీ పార్టీ పూర్తి నైరాశ్యంలో కూరుకుపోయింద‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు. జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఏ స్థాయిలో ఉన్నార‌నే విష‌యాన్ని టీడీపీ మ‌ర్చిపోయింద‌న్న ఆయ‌న‌.. జ‌గ‌న్ అంటే టీడీపీ పాల‌న‌ను అంతం చేయ‌ట‌మేన‌ని చెప్పారు. జ‌గ‌న్ అంటే పురోగ‌తి.. దార్శ‌నిక‌త‌.. బాధ్య‌త‌.. ఐక్య‌త‌.. సానుభూతి.. ప్రేమ‌.. క‌రుణ అంటూ ఉద్ఘాటించారు.

చంద్ర‌బాబు క‌ళ్లు తెరిచి చూడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని.. తాము అధికారంలోకి వ‌స్తున్నామ‌ని విజ‌య‌సాయి రెడ్డి  విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు. అధికారంలోకి రావ‌టం ఖాయ‌మ‌న్న విశ్వాసంతో పాటు.. తెలుగు త‌మ్ముళ్లు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేలా విజ‌య‌సాయి వ్యాఖ్య‌లు ఉన్నాయి.



Tags:    

Similar News