రాహుల్ ను కెలికిన విజయసాయి.. ధీటుగా పంచ్ వేసిన కాంగ్రెస్

Update: 2022-05-04 07:31 GMT
సంబంధం లేని అంశాల్లో తలదూర్చటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు.ఎవరికి వారు వారి ప్రయోజనాలే లక్ష్యంగా పని చేస్తుంటారు. అందుకే.. తమకు సంబంధం లేని అంశాల్లో తలదూర్చటానికి రాజకీయ పార్టీలు పెద్దగా ఆసక్తి చూపించవు.

ఆ మాటకు వస్తే వేలు పెట్టేందుకు సైతం ఇష్టపడవు సరికదా.. తమకు సంబంధం లేదననట్లుగా వ్యవహరిస్తుంటారు. మరీ విషయాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు.. జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన విజయసాయి రెడ్డి మర్చిపోయినట్లున్నారు.

తాజాగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. నేపాల్ లో చైనా దౌత్యవేత్త పక్కనే ఉండటం.. వారిద్దరూ పబ్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నట్లుగా.. కాస్తంత సన్నిహితంగా ఉన్నట్లు చెప్పే ఫోటోలు.. వీడియోలతో సోషల్ మీడియాలో పెను సంచలనం చోటు చేసుకుంది. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అధికార బీజేపీ రాహుల్ మీద విరుచుకుపడటం షురూ చేసింది. సరిగా చెక్ చేసుకోకుండానే రాహుల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నాల్ని బీజేపీ నేతలు పలువురు చేపట్టారు.

ఇలాంటివేళ.. తనకు ఏ మాత్రం సంబంధం లేని ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చారు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. రాహుల్ వీడియోపై తనదైన శైలిలో వ్యాఖ్యానం చేస్తూ ట్వీట్ పెట్టారు. నైట్ క్లబ్ లో రాహుల్ తో కనిపించిన మహిళ నేపాల్ లోని చైనా రాయబారి హౌ యాంకీ అని పేర్కొన్న ఆయన.. ‘చైనా విసురుతున్న వలపు వలలు పెరుగుతున్న తరుణంలో ఆ దేశపు దౌత్యవేత్తలతో కలిసి నైట్ క్లబ్ లో రాహుల్ పార్టీ చేసుకోవటం ఆందోళనకరం. ఆయనతో చైనా రాయబారి కనిపించారు’ అంటూ ఒకలాంటి తీర్పును ఇచ్చేశారు.

ఈ ట్వీట్ పై కాంగ్రెస్ నేతలు ఘాటుగా రియాక్టు అయ్యారు. సంబంధం లేని అంశంలోకి విజయసాయి ఎంట్రీ ఇవ్వటం ఏమిటన్న చాలామంది సందేహానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్. విజయసాయి చేసిన ట్వీట్ కు భారీ పంచ్ అన్నట్లుగా ఆయన ట్వీట్ ఉండటం గమనార్హం.

‘అవినీతిపరులైన విజయసాయి రెడ్డి గారు. దయచేసి వాస్తవాల్ని గమనించండి. జగన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులే మీ  సమస్య అని మాకు తెలుసు. దీని కోసం మీరు సాహిబ్ ను సంత్రప్తి పర్చాలి. నేపాల్ రాయబారి కుమార్తె పెళ్లికి రాహుల్ అక్కడికి వెళ్లాలన్న విషయాన్ని మర్చిపోవద్దంటూ ఘాటుగా రియాక్టుఅయ్యారు. ఇదంతా చూసినప్పుడు తనకు ఏ మాత్రం సంబంధం లేని అంశంలోకి వేలు పెట్టే ప్రయత్నం చేసిన విజయసాయికి వచ్చిన రాజకీయ ప్రయోజనం ఎంతన్నది పక్కన పెడితే.. దారిన పోయే దానిని మీదేసుకొని బండ బూతులు తిట్టించుకున్న చందంగా మాత్రం ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News