పెద్ద హిందువునని అంటారు.. గుడి పరిసరాల్లో సిగరెట్ తాగుతారెందుకు?

Update: 2021-06-24 07:30 GMT
వైసీపీ ఫైర్ బ్రాండ్ కమ్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి తాజాగా మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై ఆయన ఇటీవల కాలంలో ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలు సైతం మాట అనేందుకు వెనుకాడే అశోక్ గజపతిరాజు మీద ఇటీవల కాలంలో మరుస పెట్టి ఆరోపణలు.. విమర్శల్ని సంధిస్తున్నారు విజయసాయి. మాన్సాస్ ట్రస్ట్ లో ఎన్నో అక్రమాలు జరిగినట్లుగా ఆయన మండిపడుతున్నారు.

ఇప్పటివరకు అశోక్ గజపతి రాజు చేసిన పనుల్ని తప్పు పట్టిన విజయసాయి.. తాజాగా ఆయన వ్యక్తిగత అంశాల్ని ప్రస్తావించారు. తానో పెద్ద హిందువని అనుకుంటూ ఉంటారంటూ.. ‘అదే నిజమైతే గుడి పరిసరాల్లో అశోక్ గజపతిరాజు ఎందుకు సిగరెట్ తాగుతారు? అంత శ్రద్ద ఉంటే కనుక ఆలయంలో అన్నదానం.. ప్రసాదాల కోసం అత్యాధునిక వంటశాలను ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా?’’ అని ఎద్దేవా చేశారు.

బొండి మట్టి అని చెబుతూ మాన్సాస్ భూములను ఇసుక తవ్వకాలు చేసేందుకు కారుచౌకగా కట్టబెట్టారన్నారు. ఏడాదికి ఎకరం రూ.75 వేలకు కట్టబెట్టారని.. ఆయన పదవి నుంచి దిగిన తర్వాత అదే భూములకు ఎకరా రూ.14 లక్షల చొప్పున ఆదాయం లభించిందన్నారు.

సుమారు 14వేల ఎకరాల మాన్సాస్ భూముల రికార్డుల్ని ఆఫీసులో ఒక మూలన పడేశారని.. అశోక్ గజపతికి అంత చిత్తశుద్దే ఉంటే.. వాటన్నింటిని డిజిటలైజ్ చేయించి ఉండొచ్చు కదా? అని సూటి ప్రశ్నను సంధిస్తున్నారు. ఏమైనా.. ఇంతకాలం అశోక్ గజపతికి సంబంధించిన మంచే తప్పించి.. చెడు.. అందునా లోపాల్ని ఇప్పటివరకు ఎత్తి చేపింది లేదు. అందుకు భిన్నంగా విజయసాయి చేస్తున్నవ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.


Tags:    

Similar News