నాగార్జున భూములేమయ్యాయి కేసీఆర్‌..!

Update: 2019-04-17 09:34 GMT
తెలంగాణ రెవెన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయిందని, దానిని ప్రక్షాళన చేయడమే ముందున్న కర్తవ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల నిర్వహించిన సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని భూములన్నీ క్రమబద్దీకరణ చేసి ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా రెవెన్యూలో కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మేరకు సీఎం గవర్నర్‌ ను కూడా కలిశారు. దీంతో రెవన్యూ శాఖలోని ఉద్యోగుల్లో ఆందోళన మొదలవగా.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రతీ శాఖలో అవినీతి ఉందని, కేవలం రెవెన్యూనే నిందించడం సరికాదని వీఆర్వోలు నిరసన తెలుపున్నారు. అటు అవినీతిని అంతం చేయాలని ఇప్పుడే గుర్తుకు వచ్చిందా..? అంటూ ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇటీవల మంచిర్యాల జిల్లాలోని నందులపల్లి గ్రామానికి చెందిన శరత్‌ అనే యువకుడు తనకు రావాల్సిన భూమి కొత్త పాసుబుక్‌ లో నమోదు కాలేదని, అలా చేయాలంటే లంచం అడుగుతున్నారని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. అది వైరల్‌ కావడంతో సాక్షాత్తూ సీఎం ఆయనకు ఫోన్‌ చేసి సమస్యను పరిష్కరించేలా చూశారు. అప్పటి నుంచి రెవెన్యూ వ్యవస్థలో అనేక లోపాలున్నాయని, వీఆర్వోలు లంచావతారం ఎత్తారని సీఎం పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయిన్‌ స్టార్‌ విజయశాంతి కేసీఆర్‌ పై విమర్శలు గుప్పించారు. రెవెన్యూ వ్యవస్థలో సమస్యలున్నాయని గత ఐదేళ్లలో  ఒక్కటి కూడా ఫిర్యాదు రాలేదా..? అని ప్రశ్నించారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలనడం కేవలం ప్రచారం కోసమేనన్నారు. గతంలో నయీం కేసు విషయంలో కొన్ని రోజులు హడావుడి చేసిన పోలీసులు ఆ తరువాత ఆ సంగతి మరిచిపోయారు. ఎన్నో భూ దందాలు జరిపిన నయీంతో పాటు ఆయన అనుచరులు ఇప్పటికీ కొందరు కొనసాగిస్తున్నారు. ఆ శాఖలో ప్రక్షాళన ఎందుకు చేయరని విజయశాంతి అడిగారు.

ఇక 2014 ఎన్నికల్లో కేసీఆర్‌ మాట్లాడుతూ సినీ నటుడు అక్కినేని నాగార్జున హైదరాబాద్‌ శివారుల్లో అక్రమంగా భూములు సొంతం చేసుకున్నారని, అవన్నీ స్వాధీనం చేసుకుంటామని కేసీఆర్‌ చెప్పారని విజయశాంతి గుర్తు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా మీడియాకు అందించారు. అలాగే ఆ వీడియో ఉంచిన వెబ్‌ సైట్‌ లింకును అన్ని సోషల్‌ మీడియాల్లో పెట్టారు. అప్పటి ఆ హెచ్చరికలు ఏమయ్యాయి..? అని విజయశాంతి ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నికల జోరు సాగుతుండగా కేసీఆర్‌ ఆర్భాటాలకే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఈ హెచ్చరికలు పలుకుబడి ఉన్నవారికి వర్తించవా..? అని విజయశాంతి ప్రశ్నించారు.

డ్రగ్స్‌ కేసులో విరామం లేకుండా సినీ నటులందరినీ భయపెట్టి ఆ తరువాత ఎవరిపై చర్యలు తీసుకున్నారో కేసీఆర్‌ ఇప్పటి వరకు చెప్పలేదని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారిని బెదిరించడం, వారు లొంగిపోతే తెరవెనుక లాలూచీ పడడం కేసీఆర్‌ కు కొత్తేమీ కాదన్నారు. ఇప్పుడు రెవెన్యూ భూ ప్రక్షాళన పేరుతో అధికారులను, ఉద్యోగులను బెదిరిస్తున్న కేసీఆర్‌ వారి నుంచి ఏం ఆశిస్తున్నారోనని విజయశాంతి ఆరోపించారు.
   
   
   

Tags:    

Similar News