చిరుతో ఓకే..పవన్ నాట్ ఓకే..విజయశాంతి

Update: 2018-10-02 10:21 GMT
ఒకే రక్తం పంచుకొని పుట్టిన ఆ అన్నాదమ్ముల పార్టీలు వేరు.. సిద్ధాంతాలు వేరు.. అన్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కొనసాగుతుండగా.. తమ్ముడు ఆ కాంగ్రెస్ విభేదిగా మారి పోరాడుతున్నాడు. ఇద్దరి దారులు వేరైనా.. వారి మధ్య అనుబంధం మాత్రం ఇంకా పదిలంగానే ఉంది. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య కూడా చిచ్చు పెట్టడానికి రెడీ అయ్యింది రాములమ్మా.. చిరంజీవిని కాంగ్రెస్ వాదిగా మార్చి తమ్ముడు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తోంది.

తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ ఇన్నాళ్లు అజ్ఞాతవాసంలో ఉన్న విజయశాంతి ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. స్టార్ క్యాంపెయినర్ పదవిని కూడా చేపట్టారు. అందుకే కాస్త హడావుడి చేస్తున్నారు. విమర్శల వాడిని పెంచుతున్నారు. తాజాగా మాట్లాడిన విజయశాంతి.. పవన్ కళ్యాణ్ పై హాట్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ లో ఆవేశమెక్కువట.. రాజకీయాల్లో రాణించడం కష్టమంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. అయితే ఆయన అన్న చిరంజీవితో కలిసి ప్రచారం చేయడానికి సిద్ధమని ప్రకటించింది.

చిరంజీవి-విజయశాంతి రాజకీయాల్లోకి రాకముందు హిట్ పెయిర్. వీరిద్దరి జోడి వెండితెరపై ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చింది. కానీ మొదట్లో రాజకీయంగా వైరి వర్గాలుగా ఉన్నారు. విజయశాంతి టీఆర్ ఎస్ లో వెలుగు వెలిగినప్పుడు చిరంజీవి ప్రజారాజ్యంలో ఉండేవారు. అప్పుడు చిరుపై పరుశ విమర్శలను రాములమ్మ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు విజయశాంతి, చిరంజీవిలిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ చిరంజీవి రాజకీయాలపై వైరాగ్యంతో ఇప్పుడు సినిమాలు చేస్తూ కాంగ్రెస్ వాదిగానే మరిచిపోయారు. కాంగ్రెస్ తరఫున ఈ ఎన్నికల్లో పోటీచేస్తాడో లేదో చెప్పలేని పరిస్థితి. అలాంటిది విజయశాంతి ఆయనతో కలిసి ప్రచారం చేస్తానని చెబుతోంది.

ఇప్పుడు తెలంగాణలో జనసేనాని పవన్ మద్దతు టీఆర్ ఎస్ కు ఉందనే ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ పథకాలను పవన్ అప్పట్లో పొగిడేశాడు. అంతేకాదు.. పవన్ పర్యటనలకు టీఆర్ ఎస్ శ్రేణులు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో పవన్-టీఆర్ ఎస్ బంధాన్ని ఎండగట్టాలని విజయశాంతి ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం చిరంజీవి సహాయాన్ని పొందాలని చూస్తోంది. కానీ రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవి ఇలా పార్టీ కోసం తమ్ముడిని విమర్శిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి జనసేనకు మద్దతుగానే ఉన్న చిరంజీవి ఈ సారి ఎన్నికల్లో ప్రచారం చేసేది డౌటేనట.. దీంతో విజయశాంతి ఆశలు అడియాసలైనట్లే..

నిజానికి ఈ ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించిన విజయశాంతి స్టార్ క్యాంపెయినర్ గా మారి ప్రచారం చేస్తుందట.. బహుశా ఎంపీగా ట్రై చేద్దామని చూస్తుందేమో.. అయినా పోటీలో లేకుండా ఎంత ప్రచారం చేసినా ఏం లాభమని ప్రత్యర్థులు ఆడిపోసుకుంటున్నారు. తను గెలిచి మందిని గెలిపించాలని కోరుతున్నారు. మరి విజయశాంతి స్ట్రాటజీ ఏంటో ముందు ముందు తెలుస్తుంది.

   

Tags:    

Similar News